గోదావరిఖని : సింగరేణి వ్యాప్తంగా వేలాది మంది కార్మికులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ‘సొంతింటి సహకారం’ పథకాన్ని రేపు జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించనున్న రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్‌ఠాకూర్‌కు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ.. సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ గత ఐదేళ్లుగా నిరంతరాయంగా పోరాడుతున్న ‘సొంతింటి పథకం’ ప్రతిపాదనను తమ విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్‌ఠాకూర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం అభినందనీయమన్నారు.
యాజమాన్యంపై ఆర్థిక భారం లేకుండా పథకం
సొంతింటి పథకం ద్వారా సింగరేణి యాజమాన్యంపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం పడకుండా మోడల్‌ను రూపొందించినట్లు రాజారెడ్డి తెలిపారు. క్వార్టర్లు లేని కార్మికులకు సింగరేణి నుంచి అందే హెచ్‌ఆర్‌ఏ, రాష్ట్ర ప్రభుత్వం అందించే వడ్డీ లేని రుణ సహాయాన్ని అనుసంధానం చేయడం ద్వారా కార్మికులు సులభంగా సొంత ఇళ్లను నిర్మించుకునే అవకాశం కలుగుతుందని వివరించారు.
ఈ పథకం అమలైతే కార్మికులకు మాత్రమే కాకుండా ప్రభుత్వానికి కూడా ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. కార్మికులు ఇళ్లు నిర్మించుకోవడం ద్వారా రిజిస్ట్రేషన్లు, విద్యుత్ శాఖ, మున్సిపల్ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం సమకూరుతుందని తెలిపారు.
సింగరేణి ప్రాంతాల అభివృద్ధికి దోహదం
కార్మికులు సింగరేణి ప్రాంతాల్లోనే శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని రాజారెడ్డి అన్నారు. వ్యాపార సంస్థలు ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా బొగ్గు గని పరిసర పట్టణాలు ఆర్థికంగా స్థిరపడటంతో పాటు నిరంతర అభివృద్ధి సాధిస్తాయని పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ఈ ప్రయత్నం సాగుతుండటంపై సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తుతున్న ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్‌ఠాకూర్‌కు సింగరేణి కార్మికుల మద్దతు ఉంటుందని, భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వానికి కార్మికులు వెన్నుదన్నుగా నిలుస్తారని తుమ్మల రాజారెడ్డి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఆర్‌జీ-2 బ్రాంచ్ సెక్రటరీ కుంట ప్రవీణ్ కుమార్, ఆర్‌జీ-1 అధ్యక్షులు వంగల శివరాం రెడ్డి, ఆర్‌జీ-3 అధ్యక్షులు అంబాల శ్రీనివాస్, తోట నరహరిరావు, సోమారపు వెంకన్న, ఎద్దు కుమార్, ఎస్‌కే గౌస్, శ్రీహరి, ఎడ్ల వెంకటేష్, సురేష్, వినేష్, అహ్మద్ పాషా, గుగులోత్ రామకృష్ణ, కొమ్మ రమేష్, జంగ సమ్మయ్య, బుద్ధర్తి సంతోష్, తుమ్మ లక్ష్మణ్, కుమారస్వామి, బుర్ర శ్రీనివాస్, పోతు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.








