గోదావరిఖని : ప్రముఖ సివిల్ ఇంజనీర్, భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని గోదావరిఖనిలోని జీఎం కార్యాలయంలో మంగళవారం ఇంజనీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు, హైదరాబాద్ రీజియన్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (ఎలక్ట్రికల్) కోమల్ చౌదరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏరియాలోని సీనియర్ ఇంజనీర్లను సత్కరించారు. అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కె. జనార్ధన్, ఓసీ-1 ఉపరితల గని పర్యావరణ అధికారి కిషన్, బేస్ వర్క్‌షాప్ విభాగాధిపతి జీ.వి. సత్యనారాయణతో పాటు డీడీఎంఎస్ కోమల్ చౌదరిని శాలువాలతో సన్మానించారు.
విశ్వేశ్వరయ్య సేవలు ఆదర్శనీయం
ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఆయన నిరాడంబరత, దేశాభివృద్ధిపై ఉన్న అంకితభావం, ఇంజనీరింగ్ రంగానికి చేసిన విశేష సేవలు నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
మూసీ నది వరదల నివారణకు ఆయన అందించిన సేవలు, ఆటోమేటిక్ వరద గేట్ల వ్యవస్థతో పాటు దేశ నిర్మాణానికి చేసిన అనేక ఇంజనీరింగ్ సేవలను వారు గుర్తుచేశారు. ఇంజనీరింగ్ రంగానికే పరిమితం కాకుండా దేశ ఆర్థిక అభివృద్ధికి కూడా విశ్వేశ్వరయ్య విలువైన సలహాలు అందించారని తెలిపారు.
ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూడా అనేక కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయని, వాటి వెనుక ఇంజనీర్ల ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానం కీలకంగా ఉంటోందని అన్నారు. దేశ అభివృద్ధిలో ప్రతి ఇంజనీర్ తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌వోటు జీఎం ఎం. రామ్మోహన్, ఏరియా ఇంజనీర్లు ఉదయ్ భాస్కర్, దూప్ సింగ్, ప్రాజెక్ట్ ఆఫీసర్ కె. జనార్ధన్, ఐఈ డీజీఎం బి.టి. మురళీకృష్ణ, సివిల్ డీజీఎం ఎస్. రవికుమార్, పర్చేస్ అధికారి రాజా రవి చరణ్, ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రకాష్, మేనేజర్లు పాపయ్య, భరత్ కుమార్‌తో పాటు వివిధ గనులు, విభాగాల అధిపతులు, అధికారులు పాల్గొన్నారు.








