contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో ముందుకు సాగాలి : సీపీ గౌష్ ఆలం

కేశవపట్నం, కరీంనగర్ జిల్లా : విద్యార్థులు చిన్ననాటి నుంచే తమ భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని సాధించేందుకు క్రమశిక్షణ, పట్టుదలతో కష్టపడాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐపీఎస్ సూచించారు.

కేశవపట్నం మండలం మెట్‌పల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన “పోలీసులు మీకోసం” కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులకు భవిష్యత్ ప్రణాళిక, లక్ష్య సాధనపై అవగాహన కల్పించారు.

విద్యార్థులను వారి భవిష్యత్ లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్న సీపీ.. ప్రతి విద్యార్థికి గోల్ కార్డు రూపొందించి, ఫోటో ఫ్రేమ్‌ను అందజేశారు. విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుని, వాటిని చేరుకునేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు.

25 ఏళ్లకే ఐపీఎస్ సాధించాను

తన వ్యక్తిగత అనుభవాలను విద్యార్థులతో పంచుకున్న గౌష్ ఆలం, తన తండ్రి ఆర్మీలో పనిచేయడంతో చిన్ననాటి నుంచే యూనిఫాం సర్వీసులపై ఆసక్తి ఏర్పడిందని తెలిపారు. అదే తన లక్ష్యంగా పెట్టుకుని కష్టపడి 25 ఏళ్ల వయసులో ఐపీఎస్ సాధించానని చెప్పారు.

కేవలం లక్ష్యాన్ని చేరుకోవడం మాత్రమే కాకుండా, ఆ లక్ష్యం వెనుక ఉన్న ‘పర్పస్’ను నెరవేర్చడం కూడా ముఖ్యమని సీపీ అన్నారు. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకుని, దానికి అనుగుణంగా చదువు, నైపుణ్యాభివృద్ధి, సమయపాలనపై దృష్టి పెట్టాలని సూచించారు.

డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

మత్తు పదార్థాలకు అలవాటు పడితే విద్యార్థుల భవిష్యత్ దెబ్బతినే ప్రమాదం ఉందని సీపీ హెచ్చరించారు. డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉంటూ, చదువుతో పాటు క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు.

డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన డ్రగ్స్ వ్యతిరేక స్కిట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సీసీ కెమెరాల ప్రారంభం.. క్రీడా సామగ్రి పంపిణీ

మెట్‌పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను పోలీస్ కమిషనర్ ప్రారంభించారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకంగా ఉపయోగపడతాయని తెలిపారు.

అనంతరం గ్రామ పంచాయతీ కార్మికులకు హెల్మెట్లు, విద్యార్థులకు వాలీబాల్, క్యారమ్ బోర్డులు, ఇతర క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. పాఠశాల ఆవరణలో మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణపై సందేశం ఇచ్చారు.

గణేష్ మండపాల్లో భద్రతా ఏర్పాట్ల పరిశీలన

కార్యక్రమం అనంతరం కేశవపట్నం పరిధిలోని పలు గణేష్ మండపాలను సీపీ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. మండపాల వద్ద ఎలక్ట్రికల్, ఫైర్ సేఫ్టీ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులకు సూచించారు.

గణేష్ నిమజ్జనం సందర్భంగా విద్యుత్ తీగలు, నీటి వనరులు, ట్రాఫిక్ తదితర అంశాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.

మండపాల వద్ద నిర్వహిస్తున్న పాయింట్ బుక్‌లను తనిఖీ చేసిన సీపీ.. విధుల్లో ఉన్న సిబ్బంది, భద్రతా చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా పోలీసు, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఏసీపీ మాధవి, ఎస్సై శేఖర్, పోలీసు అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :