మెదక్ జిల్లా – మాసాయిపేట : మాసాయిపేట మండల కేంద్రంలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో పందుల బెడద, మురికి కాలువలు, పైప్‌లైన్ లీకేజీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని 10వ వార్డు కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
కాలనీలో విచ్చలవిడిగా పందులు సంచరిస్తూ ఇళ్లలోకి సైతం వస్తున్నాయని వారు తెలిపారు. వర్షాల సమయంలో మురికి కాలువల్లో నీరు నిలిచిపోవడంతో పారిశుధ్య సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యలపై పలుమార్లు సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని ఆరోపించారు.
కాలనీలో వాహనాల రాకపోకలు, పైప్‌లైన్ లీకేజీ కారణంగా కొన్ని ప్రాంతాల్లో గుంతలు ఏర్పడ్డాయని, దీంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వార్డు సభ్యుడు గత మూడు, నాలుగు నెలలుగా కాలనీ సమస్యలను పరిశీలించేందుకు రాలేదని కాలనీవాసులు ఆరోపించారు.
మురికి కాలువల్లో నిల్వ నీరు, పారిశుధ్య లోపాల కారణంగా చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని స్థానికులు కోరుతున్నారు. గ్రామ సర్పంచ్ గ్రామంలోని ప్రధాన సమస్యలపై అధికారులతో మాట్లాడుతున్నప్పటికీ, వార్డు స్థాయిలోని సమస్యలను కూడా సంబంధిత ప్రజాప్రతినిధులు పట్టించుకోవాలని వారు కోరారు.
పందుల బెడద, మురికి కాలువలు, పైప్‌లైన్ లీకేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపడతామని 10వ వార్డు కాలనీవాసులు హెచ్చరించారు. అధికారులు స్పందించి కాలనీలో పారిశుధ్య పరిస్థితులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.








