గన్నేరువరం : గాంధీ జయంతి సందర్భంగా సెలవు కావడంతో కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసీంపేటలోని శ్రీ మానసా దేవి ఆలయానికి శుక్రవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 5 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు సమాచారం. ఉదయం నుంచే ఆలయంలో భక్తులతో రద్దీ నెలకొని, దర్శనం కోసం క్యూ లైన్లు బారులు తీరాయి.
అయితే ఆలయంలోని అన్నదాన సత్రం వద్ద మహిళా భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భోజనం కోసం క్యూ లైన్‌లో నిల్చున్న సమయంలో అక్కడి పురుష సిబ్బంది తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని, కొందరిని చేతులతో నెట్టి పక్కకు పంపించారని మహిళా భక్తులు ఆరోపించారు.
అన్నదాన సత్రంలో భోజన హాల్ విశాలంగా ఉన్నప్పటికీ, గేటు వద్ద ఉన్న ఇరుకైన ప్రదేశంలో భక్తులను గంటల తరబడి క్యూ లైన్‌లో నిలబెట్టడంతో చిన్నారులు, వృద్ధులు, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని భక్తులు తెలిపారు.
మహిళా భక్తులతో వ్యవహరించే సమయంలో ప్రత్యేకంగా మహిళా సిబ్బందిని నియమించాలని వారు డిమాండ్ చేశారు. ప్రస్తుత సిబ్బంది తీరుపై ఆలయ కమిటీ విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్ల నిర్వహణ, అన్నదాన సత్రం వద్ద భద్రతా ఏర్పాట్లు, మహిళలు–వృద్ధులు–చిన్నారులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని భక్తులు విజ్ఞప్తి చేశారు.








