మహబూబ్‌నగర్ : మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మహబూబ్‌నగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గడియారం చౌరస్తాలో గాంధీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి బి. బాలకిషన్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బాలకిషన్ మాట్లాడుతూ గాంధీజీ చూపిన అహింస, సత్యం, సౌభ్రాతృత్వం వంటి విలువలు నేటి సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. దేశంలో మతపరమైన విభజన, పోలరైజేషన్ పెరుగుతున్న నేపథ్యంలో సామాజిక ఐక్యతను, మతసామరస్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో గాంధీ జయంతిని దేశవ్యాప్తంగా మతసామరస్య దినోత్సవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. హిందూ–ముస్లిం ఐక్యతను బలోపేతం చేయడమే గాంధీజీకి అందించే నిజమైన నివాళి అని అన్నారు.
మతం పేరుతో ప్రజలను విభజించే రాజకీయాలకు వ్యతిరేకంగా సీపీఐ నిరంతరం పోరాడుతుందని బాలకిషన్ తెలిపారు. గాంధీజీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యతను పెంపొందించేందుకు కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
గాంధీ భావజాలాన్ని ప్రజల్లో బలోపేతం చేయడం, మతసామరస్యాన్ని కాపాడటం నేటి తరానికి ముందున్న ముఖ్యమైన కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు.








