contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఎయిమ్స్‌లో రోగుల కష్టాలకు చెక్ ఎప్పుడు?

  • అత్యవసర సేవల్లో బెడ్‌ల కొరత..
  • రిపోర్టుల కోసం రోజుల నిరీక్షణ..
  • నిర్వహణపై రోగుల అసంతృప్తి

 

మంగళగిరి: మంగళగిరిలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో అత్యాధునిక వైద్య సౌకర్యాలు, నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికీ, నిర్వహణలోని లోపాలు రోగులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అత్యవసర విభాగంలో బెడ్‌లు దొరకక రోగులను ఇతర ఆసుపత్రులకు పంపిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

రోగులు చెబుతున్న వివరాల ప్రకారం, ఓపీ రిజిస్ట్రేషన్ నుంచి వైద్యులను కలవడం, పరీక్షల ఫీజులు చెల్లించడం, పరీక్షలు చేయించుకోవడం, మందులు తీసుకోవడం వరకు అనేక కౌంటర్ల వద్ద గంటల తరబడి క్యూల్లో వేచి ఉండాల్సి వస్తోంది. ఒకే స్పెషలిస్ట్‌ను మళ్లీ సంప్రదించాల్సి వచ్చినా తిరిగి అదే ప్రక్రియను అనుసరించాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పరీక్షల ఫీజులు చెల్లించే కౌంటర్లపై సరైన సమాచారం లేక రోగులు ఒక కౌంటర్ నుంచి మరో కౌంటర్‌కు తిరగాల్సిన పరిస్థితి నెలకొంటోందని అంటున్నారు. తగినంత మార్గనిర్దేశక సిబ్బంది లేకపోవడంతో క్యూల్లో తోపులాటలు, వాగ్వాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయని రోగులు పేర్కొంటున్నారు.

డాక్టర్ల సేవలు ప్రశంసనీయం.. సిబ్బంది తీరుపై విమర్శలు

రోగుల పట్ల వైద్యులు మర్యాదగా, ఓర్పుతో వ్యవహరిస్తున్నారని పలువురు ప్రశంసిస్తున్నప్పటికీ, కొంతమంది సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది మాత్రం దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు సరైన సమాచారం అందక అనవసరంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉందని చెబుతున్నారు.

ఎమర్జెన్సీలో బెడ్‌లు లేవని వెనక్కి పంపుతున్నారనే ఆరోపణలు

ఎయిమ్స్‌లో 960 బెడ్‌లు ఉన్నాయని అధికారికంగా ప్రకటిస్తున్నప్పటికీ, అత్యవసర పరిస్థితుల్లో బెడ్‌లు ఖాళీ లేవని చెబుతూ రోగులను ఇతర ఆసుపత్రులకు పంపుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. సిఫారసులు ఉంటేనే సులభంగా బెడ్‌లు లభిస్తున్నాయనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చిన్నారుల అత్యవసర ఐసీయూలో రాత్రి వేళల్లో సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని కొందరు తల్లిదండ్రులు వాపోతున్నారు.

మీడియా ప్రతినిధులకూ తప్పని ఇబ్బందులు

ఎయిమ్స్‌లో సాధారణ ప్రజలతో పాటు మీడియా ప్రతినిధులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. గురువారం ఒక మీడియా ఛానల్‌కు చెందిన జర్నలిస్టు పెరిక రమేష్ ప్రెస్‌మీట్‌కు హాజరైన అనంతరం వాంతులు, కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. ఎయిమ్స్‌లో చికిత్స కోసం ప్రయత్నించినప్పటికీ తక్షణ స్పందన లేకపోవడంతో మంగళగిరిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు సమాచారం.

రిపోర్టుల కోసం రోజుల నిరీక్షణ

సాధారణంగా ఇతర ఆసుపత్రుల్లో గంటల్లో లభించే పరీక్షల నివేదికలు ఎయిమ్స్‌లో మాత్రం రెండు రోజుల తర్వాత మాత్రమే ఇస్తున్నారని రోగులు చెబుతున్నారు. సీటీ స్కాన్, అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ, వినికిడి పరీక్షలు వంటి వాటికి అపాయింట్‌మెంట్ కోసం వారాలు, కొన్నిసార్లు నెలరోజులకు పైగా వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

క్యాంటిన్, మెడికల్ షాపుల నిర్వహణపై అసంతృప్తి

ఆసుపత్రి క్యాంటిన్ నిర్వహణ కూడా సంతృప్తికరంగా లేదని రోగులు పేర్కొంటున్నారు. తాగునీటి సౌకర్యాలు సరిగా లేక వాటర్ బాటిళ్లు కొనుగోలు చేయాలని సూచిస్తున్నారని, ఈ విషయంపై గతంలో రోగులు నిరసన తెలిపిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు. మెడికల్ షాపుల నిర్వహణలోనూ లోపాలు ఉన్నాయని విమర్శిస్తున్నారు.

ఎయిమ్స్‌లో తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నప్పటికీ, నిర్వహణలోని లోపాలు, సిబ్బంది వ్యవహార శైలిపై వస్తున్న ఫిర్యాదులను అధికారులు పరిశీలించి, రోగులకు మెరుగైన సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :