నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మదక్‌పల్లి గ్రామంలో వివాహేతర సంబంధం కోసం భర్త, అత్తను హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. కూరలో గడ్డి మందు కలిపి భోజనంగా వడ్డించిన మహిళను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మదక్‌పల్లి గ్రామానికి చెందిన సోని అనే మహిళ తన వివాహేతర సంబంధానికి భర్త భూమయ్య, అత్త భూదేవ్వ అడ్డుగా వస్తున్నారని భావించి వారిని హత్య చేయాలని పథకం రచించింది. ఈ క్రమంలో ఇంట్లో వండిన కూరలో గడ్డి మందు కలిపి భర్త, అత్తకు భోజనంగా వడ్డించింది.
భోజనం చేసిన కొద్దిసేపటికే ఇద్దరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారి పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా, వైద్యులు సకాలంలో చికిత్స అందించడంతో భూమయ్య, భూదేవ్వ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో సోని కూరలో గడ్డి మందు కలిపినట్లు తేలడంతో ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం నిందితురాలిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది.








