పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. నిలిపి ఉంచిన లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన డీసీఎం వాహనం ఢీకొనడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి వైపు నుంచి గోదావరిఖని దిశగా వస్తున్న లారీ ఎన్టీపీసీ క్రషర్ నగర్ సమీపంలో అర్ధరాత్రి సమయంలో టైరు పంచర్ కావడంతో డ్రైవర్ లారీని రోడ్డుపైనే నిలిపివేశాడు. అనంతరం అదే మార్గంలో ఛత్తీస్‌గఢ్ వైపు వెళ్తున్న డీసీఎం వాహనం నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
ప్రమాదం జరిగిన సమయంలో అటుగా వెళ్తున్న వన్‌టౌన్ సీఐ ఇంద్రసేన రెడ్డి ప్రమాదాన్ని గమనించి వెంటనే స్పందించారు. ఎన్టీపీసీ పోలీసులకు సమాచారం అందించి, వారి సహాయంతో సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా దెబ్బతిన్న డీసీఎంలో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు.
అయితే ప్రమాద తీవ్రత కారణంగా డీసీఎంలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదని, వారి గుర్తింపు కోసం చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
సమాచారం అందుకున్న ఎన్టీపీసీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన పరిస్థితులు, లారీని రోడ్డుపై నిలిపివేసిన అంశంపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.








