contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

విద్యుత్ కోతలతో రోలుగుంట ప్రజలకు ఇబ్బందులు

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండల కేంద్రంలో తరచూ విద్యుత్ అంతరాయాలు చోటుచేసుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సంతబయలు వీధి, కొవ్వూరు రూట్ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో అధిక లోడ్ కారణంగా ట్రాన్స్‌ఫార్మర్లు తరచూ ట్రిప్ అవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో ఒకవైపు ఉక్కపోత, మరోవైపు దోమల బెడద కారణంగా ప్రజలు రాత్రివేళ నిద్రపోలేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ సమస్యలు తలెత్తిన సమయంలో సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తోందని వినియోగదారులు పేర్కొంటున్నారు.

రోలుగుంట మండలానికి నియమితులైన విద్యుత్ ఏఈ రెండు మండలాల పరిధిని పర్యవేక్షించాల్సి వస్తుండటంతో వినియోగదారుల సమస్యలపై వెంటనే స్పందించడం కష్టంగా మారిందని తెలుస్తోంది. నర్సీపట్నం మండలం పరిధిలోని వేములపూడి, ధర్మసాగరం, సుబ్బారాయుడుపాలెం, చిట్టిబిల్లి గ్రామాలతో పాటు రోలుగుంట మండలంలోని 28 పంచాయతీలకు విద్యుత్ సేవలను పర్యవేక్షించే బాధ్యత ఒకే అధికారిపై ఉండటంతో సేవల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

ఏఈ కార్యాలయం పేరుకే రోలుగుంట మండలానికి ఉన్నప్పటికీ, ఫిర్యాదులు ఇవ్వాలంటే వినియోగదారులు నర్సీపట్నానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని వారు ఆరోపిస్తున్నారు. దీంతో చిన్న చిన్న సమస్యల పరిష్కారానికే ప్రజలు సమయం, డబ్బు వెచ్చించాల్సి వస్తోందని అంటున్నారు.

రోలుగుంట మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో విద్యుత్ సరఫరాను మెరుగుపరచడంతో పాటు, స్థానికంగా అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను కోరుతున్నారు. నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించి వినియోగదారుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :