contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

లాటరైట్ గనుల లీజులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ

అమరావతి, జూన్ 2: లాటరైట్ ఖనిజం వర్గీకరణలో కేంద్ర ప్రభుత్వం చేసిన తాజా మార్పుల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో గనుల లీజుల మంజూరు ప్రక్రియ నిలిచిపోయిందని పేర్కొంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి మంగళవారం లేఖ రాశారు. పెండింగ్‌లో ఉన్న గనుల లీజు దరఖాస్తులను పాత నిబంధనల ప్రకారమే ప్రాసెస్ చేసేందుకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని ఆయన కోరారు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం లాటరైట్‌లో అల్యూమినియం శాతం 20 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే దానిని ఉప ఖనిజం (మైనర్ మినరల్)గా కాకుండా బాక్సైట్‌ (మేజర్ మినరల్)గా పరిగణించాలని నిర్ణయించింది. ఈ మార్పుతో రాష్ట్రంలో గనుల లీజుల మంజూరు ప్రక్రియ పూర్తిగా స్తంభించిపోయిందని ముఖ్యమంత్రి తన లేఖలో వివరించారు.

కొత్త నిబంధనల నేపథ్యంలో ప్రస్తుతం మైనర్ మినరల్ కింద పరిశీలనలో ఉన్న 402 గనుల లీజు దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసినట్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. వీటిలో 19 లెటర్ ఆఫ్ ఇంటెంట్ కేసులు, 113 ప్రభుత్వ భూములకు సంబంధించిన దరఖాస్తులు, 255 అటవీ భూముల దరఖాస్తులు, 15 పట్టా భూముల దరఖాస్తులు ఉన్నాయని తెలిపారు.

పాత నిబంధనలను అనుసరించి వందలాది మంది దరఖాస్తుదారులు ఇప్పటికే అప్లికేషన్ ఫీజులు చెల్లించడంతో పాటు భూముల కొనుగోలు, అటవీ అనుమతుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారికి ఆర్థిక నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

గతంలో మైకా, క్వార్ట్జ్, బారైట్స్ వంటి ఖనిజాలను మైనర్ మినరల్స్ నుంచి మేజర్ మినరల్స్‌గా వర్గీకరించినప్పుడు కేంద్ర ప్రభుత్వం ‘సేవింగ్ క్లాజ్’ అమలు చేసిందని గుర్తుచేశారు. అదే విధానాన్ని లాటరైట్ ఖనిజానికి కూడా వర్తింపజేసి, ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 402 దరఖాస్తులను పాత నిబంధనల ప్రకారం మరో రెండేళ్లపాటు పరిశీలించే అవకాశం కల్పించాలని కోరారు.

ఈ సడలింపు వల్ల దరఖాస్తుదారులకు ఆర్థిక నష్టం తగ్గడమే కాకుండా న్యాయపరమైన వివాదాలను కూడా నివారించవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అలాగే సిమెంట్, ఐరన్ ఓర్, రహదారి నిర్మాణ రంగాలకు అవసరమైన ముడిసరుకు సరఫరా కొనసాగడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పరిరక్షించబడతాయని ఆయన తన లేఖలో స్పష్టం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :