విజయనగరం : ఎర్ర బస్సు కూడా రాని ప్రాంతానికి ఎయిర్‌బస్ అవసరమా అని గతంలో ఎగతాళి చేసిన వారికే నేడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సమాధానంగా నిలిచిందని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధిపై గతంలో చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు.
గతంలో కొందరు ఉత్తరాంధ్రను చిన్నచూపు చూసి, ఇక్కడి ప్రజలను అవమానించారని లోకేశ్ విమర్శించారు. “ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్‌పోర్టు వచ్చింది… మన ప్రధాని నరేంద్ర మోదీ వచ్చారు. ఇదే మన ఉత్తరాంధ్ర దెబ్బ, అర్థమైందా రాజా!” అంటూ ప్రత్యర్థులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఉత్తరాంధ్ర ప్రజల కలలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెక్కలు తొడిగారని కొనియాడిన లోకేశ్, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోదీ పూర్తి మద్దతు అందిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా “నమో” అనే పదానికి తనదైన అర్థాన్ని వివరిస్తూ, “నమో అంటే హిమ్మత్ (ధైర్యం), విశ్వాస్ (నమ్మకం), సురక్షిత్ భారత్ (సురక్షిత భారతం)” అని అన్నారు. దేశాభివృద్ధి, రాష్ట్ర ప్రగతి కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు.
సహజ వనరులతో సమృద్ధిగా ఉన్న ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కీలక మౌలిక సదుపాయంగా నిలుస్తుందని లోకేశ్ అభిప్రాయపడ్డారు. ఈ విమానాశ్రయం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి “పవర్ ఇంజిన్” గా మారి పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాలకు కొత్త అవకాశాలు కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
విమానాశ్రయ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసిన జీఎంఆర్ సంస్థను ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. భోగాపురం విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్రకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించడంతో పాటు భారీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.








