విజయనగరం: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, స్వర్ణాంధ్ర విజన్ సాకారానికి నేటి రోజు అత్యంత కీలకమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.18 వేల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని ప్రకటించారు. ఉత్తరాంధ్ర యువత ప్రగతికి భోగాపురం విమానాశ్రయం ఒక రన్‌వే, లాంచ్‌ప్యాడ్‌లా పనిచేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
భోగాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని మోదీ, స్వర్ణాంధ్రతో పాటు వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డబుల్ ఇంజిన్ ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తోందన్నారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవాలను స్మరిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన, గిరిజనుల హక్కుల కోసం పోరాడిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో విమానాశ్రయాన్ని ప్రారంభించడం గర్వకారణమని పేర్కొన్నారు.
గతంలో కొద్ది మంది పేర్లకే విమానాశ్రయాలు పరిమితమయ్యాయని, ప్రస్తుతం దేశ చరిత్ర, సంస్కృతిని గౌరవించేలా మహనీయుల పేర్లను విమానాశ్రయాలకు నామకరణం చేస్తున్నామని తెలిపారు. గతంలో దేశంలో కేవలం 74 విమానాశ్రయాలు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 166కు పెరిగిందని, ఉడాన్ పథకం ద్వారా సామాన్య ప్రజలకు కూడా విమాన ప్రయాణం అందుబాటులోకి వచ్చిందన్నారు.
ఈ సందర్భంగా ఏపీకి చెందిన 13 వేల మందికి పైగా గిరిజన మహిళలు థింసా నృత్యంతో గిన్నిస్ ప్రపంచ రికార్డు నెలకొల్పడం రాష్ట్రానికి గర్వకారణమని ప్రధాని అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేస్తోందని కొనియాడారు.
రాష్ట్రాన్ని తీరప్రాంత ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దేందుకు కోస్టల్ ఎకానమిక్ కారిడార్ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రధాని తెలిపారు. విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం వరకు ఉన్న పోర్టులను ఆధునీకరించడంతో పాటు మూలపేట, రామాయపట్నంలో కొత్త నౌకాశ్రయాలను నిర్మిస్తున్నామని చెప్పారు. విశాఖ–రాయపూర్ ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు జాతీయ రహదారుల విస్తరణ, రూ.1 లక్ష కోట్లతో రైల్వే కనెక్టివిటీ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. 70కి పైగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణతో పాటు పీఎం గతి శక్తి మాస్టర్ ప్లాన్ ద్వారా రైలు, పోర్టు, విమానాశ్రయాలను సమగ్రంగా అనుసంధానం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ యువత ఐటీ, సాఫ్ట్వేర్, సాంకేతిక రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారని, అందుకే విశాఖలో సెమీకండక్టర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశామని ప్రధాని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి వల్ల గూగుల్ డేటా సెంటర్‌తో పాటు అనేక అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని అన్నారు. సెమీకండక్టర్ పరిశ్రమలు, ఏఐ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్ల ద్వారా యువతకు స్థానికంగానే భారీ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
నక్కపల్లిలో దేశంలోనే అతిపెద్ద ఫార్మా పార్క్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ ప్రముఖ ఔషధ తయారీ కేంద్రంగా ఎదుగుతుందని, రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని ప్రధాని వెల్లడించారు. గత మూడు పర్యటనల్లోనే ఏపీలో రూ.2 లక్షల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు గుర్తు చేశారు. రానున్న రోజుల్లో విశాఖ ఎకనమిక్ రీజియన్ ఆసియాలోనే కీలక పారిశ్రామిక కేంద్రంగా అవతరిస్తుందని, అందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని స్పష్టం చేశారు.
పెట్టుబడులు పెరగడం ద్వారా పరిశ్రమలు అభివృద్ధి చెందడం, ఉత్పత్తి, ఎగుమతులు పెరగడం, తద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడమే ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అమలు చేస్తున్న అభివృద్ధి ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌ను ప్రగతి పథంలో నిలబెట్టి స్వర్ణాంధ్ర – వికసిత్ భారత్ లక్ష్యాలను సాకారం చేస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.








