గోదావరిఖని : రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 21వ డివిజన్ పరిధిలోని వీర్లపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు 21వ డివిజన్ కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరానికి స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలు పొందారు.
ఈ సందర్భంగా పట్టణ ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బి. మానికేశ్వర్ రెడ్డి గ్రామ ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రస్తుతం వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు అధికంగా ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
కార్పొరేటర్ కందుల స్వరూప సతీష్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ డివిజన్‌లో ఇలాంటి వైద్య శిబిరాలను నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్‌చార్జి కోకిరాల శ్రీనివాస్, సూపర్‌వైజర్ ఎన్. పారిజాతం, ఎం. తిరుపతి, నర్సింగ్ సిబ్బంది జయ, ప్రభావతి, ఆశా వర్కర్లు ఎం. రజిత, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.








