విజయనగరం : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం కావడంతో ప్రపంచం మొత్తం ఇప్పుడు ఉత్తరాంధ్ర వైపు చూస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. విమానాశ్రయ ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధి దిశగా ఇది చారిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించారు.
ప్రతిపక్షాల విమర్శలకు తమ ప్రభుత్వం అభివృద్ధి పనులతోనే సమాధానం చెప్పిందని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి బలమైన సింహద్వారంగా మారనుందని, దీని ద్వారా రాబోయే రోజుల్లో వేలాది మంది యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా విమర్శకులను ఉద్దేశించి మాట్లాడుతూ, “ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఎర్రబస్సులు మాత్రమే తిరిగే వెనుకబడిన ప్రాంతమని హేళన చేశారు. కానీ నేడు కళ్లు తెరిచి చూడండి… ఎర్రబస్సులు తిరిగిన నేలపైనే అత్యాధునిక ఎయిర్బస్సులు ల్యాండ్ అయ్యే స్థాయికి ఉత్తరాంధ్రను తీసుకొచ్చాం” అంటూ ఘాటుగా స్పందించారు.
దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా ఉత్తరాంధ్ర నిలుస్తోందని పేర్కొన్న ఆయన, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘వికసిత్ భారత్’, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ‘విజన్-2047’ లక్ష్యాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్ర పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాల్లో కొత్త అవకాశాలు తెరుచుకుంటాయని, పెట్టుబడులు పెరగడంతో ప్రాంత ఆర్థికాభివృద్ధికి కొత్త ఊపు లభిస్తుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చే అభివృద్ధి కేంద్రంగా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.








