నిజామాబాద్ జిల్లా : నవీపేట్ మండల కేంద్రంలో భారత్ గ్యాస్ తేజ ఏజెన్సీపై సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో వినియోగదారులు తీవ్ర ఆందోళన చేపట్టారు. గ్యాస్ సిలిండర్ల కొరత, బ్లాక్ మార్కెట్ ఆరోపణలను నిరసిస్తూ ఏజెన్సీ ఎదుట సిలిండర్లతో రాస్తారోకో నిర్వహించారు. ఏజెన్సీ యాజమాన్యంపై వెంటనే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సీపీఎం పార్టీ డిమాండ్ చేసింది.
నిరసన కార్యక్రమం సందర్భంగా మండల తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆర్‌ఐ, ఎస్‌ఐలు సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కారానికి ప్రయత్నించారు. అయితే ఏజెన్సీ యాజమాన్యంతో ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ వారు స్పందించకపోవడాన్ని వినియోగదారులు, సీపీఎం నాయకులు తీవ్రంగా ఖండించారు.
సీపీఎం నాయకులు మాట్లాడుతూ, కృత్రిమ కొరత సృష్టిస్తూ గృహ వినియోగ సిలిండర్లను హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లకు బ్లాక్ మార్కెట్‌లో ఒక్కోటి రూ.1800కు విక్రయిస్తున్నారని ఆరోపించారు. సుమారు 17 వేల మంది వినియోగదారులు ఉన్న ఈ ఏజెన్సీని నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
నిబంధనల ప్రకారం 6 వేల మంది వినియోగదారులకు ఒక గ్యాస్ ఏజెన్సీ ఏర్పాటు చేసే అవకాశం ఉండటంతో, ప్రస్తుతం ఉన్న వినియోగదారుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతంలో మరో మూడు ఏజెన్సీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘాలు లేదా రిజిస్టర్ అయిన యువజన సంఘాలకు కొత్త ఏజెన్సీలను అప్పగించాలని కోరారు.
సీపీఎం మండల కార్యదర్శి నాయక్‌వాడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. సమస్యపై స్పందించిన తహసీల్దార్, ఏజెన్సీ యాజమాన్యంతో మాట్లాడి రేపటిలోగా గ్యాస్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గౌతమ్‌తో పాటు పలువురు వినియోగదారులు పాల్గొన్నారు.








