contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఆర్టీసీ బస్సుల్లో చోరీలకు పాల్పడుతున్న మహిళా ముఠా అరెస్ట్.. రూ.3.5 లక్షల డైమండ్ గోల్డ్ నెక్లెస్ స్వాధీనం

  • ఆర్టీసీ బస్సుల్లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళా కిలాడీల అరెస్ట్
  • రూ.3.5 లక్షల విలువైన డైమండ్ గోల్డ్ నెక్లెస్ స్వాధీనం – ప్రత్యేక పోలీస్ బృందం చాకచక్యంతో కేసు ఛేదన

 

తిరుపతి  పాకాల : ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళా దొంగలను పాకాల పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.3.5 లక్షల విలువైన 32 గ్రాముల డైమండ్ గోల్డ్ నెక్లెస్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసును అత్యంత చాకచక్యంగా ఛేదించిన ప్రత్యేక పోలీస్ బృందాన్ని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు అభినందించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇటీవల పాకాల మండల పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల బ్యాగుల నుంచి బంగారు ఆభరణాలు మాయమవుతున్నట్లు పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.

పాకాల పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు దర్యాప్తును ఇన్‌స్పెక్టర్ టి. చిన్న గోవిందు పర్యవేక్షణలో, ఎస్‌ఐ తరుణ్, డబ్ల్యూఎస్‌ఐ నాగమంజుల నేతృత్వంలోని ప్రత్యేక బృందం చేపట్టింది. సాంకేతిక ఆధారాలు, నిందితుల కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు శంఖంపల్లి ఫ్లైఓవర్ క్రింద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకుని విచారించారు.

విచారణలో వారు ఆర్టీసీ బస్సుల్లో చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. అరెస్టు చేసిన మహిళలను చిత్తూరు జిల్లాకు చెందిన జి. దివ్య (31), బి. రాధిక (38), బి. మేరీ (33)లుగా గుర్తించారు. వారి వద్ద నుంచి 32 గ్రాముల బరువున్న డైమండ్ గోల్డ్ నెక్లెస్ చైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆభరణం విలువ సుమారు రూ.3.5 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

ప్రాథమిక విచారణలో ఈ మహిళా ముఠా ప్రధానంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలను లక్ష్యంగా చేసుకుని, రద్దీని ఆసరాగా తీసుకుని తోపులాటల మధ్య ప్రయాణికులకు తెలియకుండా బ్యాగుల్లోని విలువైన బంగారు ఆభరణాలను అపహరిస్తున్నట్లు వెల్లడైంది.

ఈ సందర్భంగా పాకాల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ టి. చిన్న గోవిందు మాట్లాడుతూ, బస్సుల్లో ప్రయాణించే మహిళలు తమ హ్యాండ్ బ్యాగులు, విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కేసు నమోదైన కొద్ది రోజుల్లోనే నిందితులను గుర్తించి అరెస్ట్ చేయడంతో పాటు చోరీ సొత్తును రికవరీ చేసిన ఇన్‌స్పెక్టర్ టి. చిన్న గోవిందు, ఎస్‌ఐ తరుణ్, డబ్ల్యూఎస్‌ఐ నాగమంజుల మరియు ప్రత్యేక బృంద సభ్యులను జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ప్రత్యేకంగా అభినందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :