న్యూఢిల్లీ : ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కొనసాగుతున్న నిరసనలు శనివారం మరింత ఉద్రిక్తంగా మారాయి. గత 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్చుక్ను పోలీసులు ఆసుపత్రికి తరలించిన కొద్ది గంటలకే, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు.
పోలీసుల సమాచారం ప్రకారం, సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వైద్యుల సలహా మేరకు శనివారం తెల్లవారుజామున ఆయనను ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే, వాంగ్చుక్ను నిరసనకారులకు తెలియకుండా బలవంతంగా, అనుచితంగా తరలించారని సీజేపీ ఆరోపించింది.
ఈ సందర్భంగా అభిజీత్ దీప్కే మాట్లాడుతూ, వాంగ్చుక్ను తరలించే సమయంలో తాను అడ్డుకునే ప్రయత్నం చేయగా తనకు కూడా గాయాలయ్యాయని పేర్కొన్నారు. అనంతరం మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, నిరసన కొనసాగింపుగా తాను ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు.
ఇదిలా ఉండగా, అభిజీత్ దీప్కే ప్రసంగిస్తున్న సమయంలో ఓ గుర్తుతెలియని మహిళ ఆయనపై సిరా వంటి ద్రవాన్ని విసరడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై సీజేపీ స్పందిస్తూ, ఎలాంటి దాడులు జరిగినా తమ ఉద్యమాన్ని ఆపబోమని, రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
నీట్-యూజీ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ జూన్ 20 నుంచి జంతర్‌మంతర్ వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
అయితే, వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలించడం పూర్తిగా వైద్యుల సూచనల మేరకేనని పోలీసులు వెల్లడించారు. మరోవైపు, సీజేపీ మాత్రం తమ నిరసనను అణిచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోంది. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.








