కాకినాడ : కాకినాడ నగరంలోని 16 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రముఖ వివేకానంద పార్కు నిర్వహణ రోజురోజుకూ అధ్వాన్నంగా మారుతోందని పౌర సంక్షేమ సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పార్కులో నిర్వహణ, అభివృద్ధి, పచ్చదనం, పరిశుభ్రత, లైటింగ్, టాయిలెట్ సౌకర్యాలు క్రమంగా క్షీణిస్తున్నాయని సంఘం ప్రతినిధులు ఆరోపించారు.
విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ తరహాలో పీపీపీ విధానంలో పార్కును అప్పగించాలనే ఉద్దేశంతోనే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడిందని పేర్కొన్నారు. పార్కు పడమర వైపున రక్షణ ప్రహరీ లేకపోవడంతో అక్కడి ప్రైవేట్ హోటల్, కళాక్షేత్రం, సైన్స్ సెంటర్, వాటర్ వర్క్స్‌కు ప్రత్యేక గేట్లు ఏర్పాటు చేయడం ద్వారా పార్కును ప్రైవేట్ అవసరాలకు ఉపయోగిస్తున్నట్లుగా కనిపిస్తోందని విమర్శించారు.
పార్కులో రాత్రి వేళల్లో మద్యం సేవించడం, గంజాయి వినియోగం, పేకాట, ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, ప్రతి ఉదయం ఖాళీ మద్యం సీసాలు, బీర్ బాటిళ్లు, కండోమ్‌లు కనిపించడం ఆందోళనకరమని తెలిపారు. పారిశుధ్య నిర్వహణ సరిగా లేక చెత్త పేరుకుపోవడంతో పార్కు ఆహ్లాదకర వాతావరణాన్ని కోల్పోతోందని అన్నారు.
పార్కులో సుమారు 35 శాతం విద్యుత్ దీపాలు వెలగడం లేదని, స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు పనికిరాక నేలకూలిపోయాయని, మరికొన్ని మరమ్మతులు లేక నిరుపయోగంగా ఉన్నాయని ఆరోపించారు. మహిళా, పురుషుల టాయిలెట్ల వద్ద పర్యవేక్షణ సిబ్బంది లేక పరిశుభ్రత దెబ్బతిందని తెలిపారు.
చెట్లు అధికంగా పెరిగిపోవడంతో కొమ్మలు తొలగించకపోవడం వల్ల వెలుగుతున్న కొద్ది దీపాల కాంతి కూడా పార్కు అంతటా ప్రసరించడం లేదని, దీంతో రాత్రివేళల్లో చీకటి పెరిగి మహిళలు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కుక్కల బెడద, జేబుదొంగలు, సెల్‌ఫోన్ చోరీలు, ఆకతాయిల వేధింపులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు.
జవహర్ వీధి గేటు వద్ద భద్రతా సిబ్బంది లేకపోవడంతో వాహనాల పార్కింగ్ సమస్య తీవ్రమైందని తెలిపారు. పడమర వైపు ప్రహరీ లేకపోవడం, తూర్పు వైపు గ్రిల్ ఎత్తు తక్కువగా ఉండటంతో కొందరు విద్యార్థులు గోడలు దూకి పార్కులోకి ప్రవేశిస్తున్నారని చెప్పారు.
పార్కులో పూర్తి స్థాయి సీసీ కెమెరాలు, పోలీస్ అవుట్‌పోస్ట్ ఏర్పాటు చేయాలని, భద్రతా సిబ్బందికి, పారిశుధ్య కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే పార్కులో తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేసి సందర్శకులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు.
పార్కు చుట్టూ ఉన్న చెట్ల కొమ్మలను తొలగించి లోపలి ప్రాంగణం బయటకు కనిపించేలా చేయాలని, ప్రత్యేక అధికారిని నియమించి నిర్వహణ, పచ్చదనం, పరిశుభ్రత, లైటింగ్, టాయిలెట్ సౌకర్యాలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.
2024లో నరికివేసిన ఏడాకుల చెట్లను పూర్తిగా వేరుతో తొలగించకపోవడంతో అవి మళ్లీ పెరిగాయని, వాటి పుప్పొడి కారణంగా ఉబ్బసం, శ్వాసకోశ, చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని, ముఖ్యంగా గర్భిణీలు, చిన్నారులకు హానికరమని సంఘం పేర్కొంది. పార్కు పరిసరాల్లో ఉన్న కోనోకార్పస్ చెట్లు కూడా ఆరోగ్యానికి అనుకూలం కావని తెలిపింది.
అధికారులు, ప్రజాప్రతినిధులు పార్కును సందర్శించడం మాత్రమే కాకుండా సమస్యల పరిష్కారానికి కార్యాచరణ అమలు చేయాలని కోరారు. పడమర వైపున ఉన్న ప్రైవేట్ గేట్లను వెంటనే మూసివేసి, ఎత్తైన రక్షణ ప్రహరీ నిర్మించాలని, లేనిపక్షంలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని పౌర సంక్షేమ సంఘం హెచ్చరించింది.








