తాడేపల్లి : గుంటూరులో ఓ మహిళపై జరిగిన దాడి ఘటన రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్ర ఆందోళన కలిగిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. ఈ ఘటన మానవత్వానికే మచ్చ అని పేర్కొంటూ, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
శనివారం విడుదల చేసిన ప్రకటనలో జగన్ మాట్లాడుతూ, ఈ ఘటన బుధవారం జరిగినప్పటికీ మూడు రోజుల పాటు దానిని కప్పిపుచ్చే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైన తర్వాతే ప్రభుత్వం స్పందించిందని విమర్శించారు. అనంతరం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రచారం చేసుకోవడం మరింత విచారకరమని పేర్కొన్నారు.
బాధితురాలు మొదటి దాడి జరిగిన వెంటనే పోలీసులను ఆశ్రయించినప్పటికీ వెంటనే స్పందించి ఉంటే అనంతర పరిణామాలను నివారించే అవకాశం ఉండేదని జగన్ అన్నారు. ఆమె ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని ఉంటే ఇంతటి దారుణం జరిగేది కాదని అభిప్రాయపడ్డారు. బాధితురాలికి రక్షణ కల్పించడంలో పోలీసు వ్యవస్థ విఫలమైందని ఆరోపించారు.
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అధికార పార్టీ నాయకుల ఒత్తిడిలో పనిచేస్తోందని, చట్టాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని జగన్ విమర్శించారు. అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలపై మాత్రం కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.
అధికార పార్టీ నాయకులకు చట్టంపై భయం లేకుండా పోయిందని, అందుకే మహిళలపై దాడులు వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని జగన్ అన్నారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని, ప్రభుత్వం మహిళల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు.
మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకుని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని జగన్ కోరారు.








