contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

తెలంగాణలో గుడిసెలు లేకుండా చేస్తాం : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

వికారాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత పక్కా ఇల్లు అందజేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయంగా పాలన కొనసాగుతోందని ఆయన అన్నారు.

వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో రూ.184.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రహదారుల అభివృద్ధి పనులకు మంత్రులు శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం పరిగి పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీ, బహిరంగ సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వివరాలు వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లు లేని పేదలకు సొంతంగా పక్కా ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోందని ఆయన తెలిపారు. మొదటి విడత అనంతరం అర్హులైన మిగతా లబ్ధిదారులకు కూడా రెండో విడతలో ఇళ్ల మంజూరు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు.

వికారాబాద్ జిల్లా రహదారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.900 కోట్ల నిధులను మంజూరు చేసిందని, అందులో భాగంగా పరిగి నియోజకవర్గానికి రూ.184.15 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. మెరుగైన రోడ్ల సౌకర్యం కల్పించడం ద్వారా పరిశ్రమలు జిల్లాకు ఆకర్షితమై, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి, ప్రభుత్వం నిరుపేదలకు కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంతో పాటు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. అలాగే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి హామీలను విజయవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు.

రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :