తనను ఆంధ్రోడన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి బతకడానికి హైదరాబాద్ కు వచ్చినట్టే తాను కూడా హైదరాబాద్ కు వచ్చానని ఆయన చెప్పారు.
ఎంతో మందిని చీటింగ్ చేసిన కౌశిక్ రెడ్డితో తనకు పోలికేంటని ఎద్దేవా చేశారు. తనను బీఆర్ఎస్ పార్టీలో చేర్పించింది హరీశ్ రావు అని చెప్పారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని తెలిపారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని అసెంబ్లీ స్పీకర్ కూడా ప్రకటించారని చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీని కౌశిక్ రెడ్డి నాశనం చేశారని గాంధీ దుయ్యబట్టారు. కౌశిక్ రెడ్డి చీటర్, బ్రోకర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన మనోభావాలు దెబ్బతినడం వల్లే తాను ప్రతిస్పందించాల్సి వచ్చిందని చెప్పారు. పదేపదే తనను రెచ్చగొట్టడం వల్లే స్పందించాల్సి వచ్చిందని అన్నారు. పిల్లిని గదిలో బంధించి కొడితే… అది కూడా తిరగబడుతుందని చెప్పారు.
సెటిలర్ల కాలిలో ముల్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానని గతంలో కేసీఆర్ చెప్పారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సూచించిన వారికే పీఏసీ పదవి ఇవ్వాలని ఏమీ లేదన్నారు. గతంలో పీఏసీ పదవిని కాంగ్రెస్ నేతకు కాకుండా అక్బరుద్దీన్ ఒవైసీకి ఎందుకిచ్చారని ప్రశ్నించారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు ‘ఛలో గాంధీ’ నివాసానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు.