పెద్దపల్లి/గోదావరిఖని : గోదావరిఖని పట్టణంలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. రామగుండం ట్రాఫిక్ సీఐ బి. రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీల్లో మొత్తం 11 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు.
పట్టుబడిన వారిని బుధవారం గోదావరిఖని సెకండ్ అడిషనల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా, వారిలో తొమ్మిది మందికి మొత్తం రూ.15,500 జరిమానా విధించారు. మద్యం సేవించి ఆటోలు నడిపిన ఇద్దరు ఆటో డ్రైవర్లకు కోర్టు జైలు శిక్ష విధించగా, వారిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించినట్లు ట్రాఫిక్ సీఐ తెలిపారు.
ఈ సందర్భంగా సీఐ బి. రాజేశ్వర్ రావు మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు తమ వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సూచించారు.
అలాగే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని, రోడ్డు భద్రతా నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు భవిష్యత్తులో కూడా నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.








