పెద్దపల్లి జిల్లా – రామగుండం, జూన్ 3: గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుధవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. ఓడేడు నుంచి ఉదయం 5.15 గంటలకు గోదావరిఖనికి బయల్దేరిన బస్సు, రామగుండం ఆర్జీ-2 ఓసీపీ-3 సీఎస్పీ సమీపంలోని మూలమలుపు వద్ద ఉదయం సుమారు 6.55 గంటల సమయంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది.
డ్రైవర్ విజయ్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రయాణికులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాదం ధాటికి విద్యుత్ స్తంభం సగానికి విరిగిపోగా, విద్యుత్ తీగలు రోడ్డుపై అడ్డంగా పడిపోయాయి. దీంతో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ప్రమాదాన్ని గమనించిన సింగరేణి సీఎస్పీ సమీపంలోని ఓ సెక్యూరిటీ గార్డు వెంటనే ఎస్ అండ్ పీసీ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సింగరేణి వర్క్‌షాప్ ఎలక్ట్రికల్ సిబ్బంది సహాయంతో వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేసి, రోడ్డుపై పడిన తీగలను పక్కకు తొలగించారు.
అదృష్టవశాత్తు బస్సు మరికొంత ముందుకు వెళ్లి ఉంటే సమీపంలోని లోయలో పడిపోయే ప్రమాదం ఉండేదని స్థానికులు తెలిపారు. అలా జరిగి ఉంటే భారీ ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉండేదని పేర్కొన్నారు.
అనంతరం బస్సులోని ప్రయాణికులను మరో ఆర్టీసీ బస్సులో గోదావరిఖనికి తరలించారు. తృటిలో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డామని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంపై సంబంధిత అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.








