చెన్నై/న్యూఢిల్లీ, జూన్ 2: తమిళనాడు బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రముఖ నేత అన్నామలై భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. మంగళవారం ఢిల్లీలో బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్లను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించినట్లు సమాచారం.
మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై 2020లో బీజేపీలో చేరి తక్కువ కాలంలోనే తమిళనాడులో పార్టీకి ప్రముఖ ముఖచిత్రంగా ఎదిగారు. దూకుడు రాజకీయ శైలి, ప్రభుత్వాలపై విమర్శలతో రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు.
అయితే, పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం లభించడం లేదనే అసంతృప్తి ఆయనలో ఉన్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు అంశంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం రాజ్యసభ సభ్యత్వాన్ని ఆఫర్ చేసినప్పటికీ ఆయన అంగీకరించలేదని సమాచారం.
ఇటీవల తమిళనాడు రాజకీయాల్లో చోటుచేసుకున్న మార్పులు, ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీ నాయకత్వంతో అన్నామలైకి విభేదాలు పెరిగినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాజీనామా అనంతరం వెంటనే కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన ఆయనకు లేదని, జాతీయవాద భావజాలంతో ముందుగా ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించి, భవిష్యత్తులో దానిని రాజకీయ వేదికగా విస్తరించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, జూన్ 4న అన్నామలై జన్మదినం సందర్భంగా చెన్నైలో ఆయన అభిమానులు, మద్దతుదారులు భారీ ఎత్తున పోస్టర్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే రాజీనామా వార్తలపై అన్నామలై లేదా బీజేపీ అధిష్ఠానం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.








