కోమరం భీం ఆసిఫాబాద్ జిల్లా: కాగజ్‌నగర్ పట్టణంలో కొనసాగుతున్న నిత్యాన్నదాన సత్రముకు మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయంపై కోనేరు కోనప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారం కాగజ్‌నగర్‌లోని నిత్యాన్నదాన సత్రములో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అధికారుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. గత కొంతకాలంగా ఈ సత్రం ద్వారా ప్రతిరోజూ వందలాది పేదలకు అన్నదానం జరుగుతోందని, ముఖ్యంగా ప్రస్తుత వేసవి కాలంలో సామాన్యుల దాహం తీర్చేందుకు అంబలి పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు.
ఇలాంటి సేవా కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అధికారులపై ఉండగా, నోటీసులు జారీ చేసి అడ్డుకోవడం అన్యాయమని కోనప్ప మండిపడ్డారు. నోటీసులు ఇవ్వడానికి గల కారణాలను మున్సిపల్ అధికారులు బహిరంగంగా వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలకు ఆటంకం కలిగించవద్దని సూచించారు.
ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, నిత్యాన్నదాన సత్రము సిబ్బంది, అలాగే పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.








