కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలో “పోలీసులు మీకోసం” కార్యక్రమం భాగంగా ఆదివారం భారీ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. బెజ్జూర్ పోలీసుల ఆధ్వర్యంలో, మంచిర్యాలకు చెందిన మెడిలైఫ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఈ మెగా మెడికల్ క్యాంప్ జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ నితికా పంత్ ఐపీఎస్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. వైద్య శిబిరంలో సుమారు 500 మంది ప్రజలు పాల్గొని ఈసీజీ, 2డీ ఇకో, షుగర్, బీపీ, కంటి పరీక్షలు తదితర వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
శిబిరంలో జనరల్ మెడిసిన్, పల్మనాలజీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ, రేడియోలజీ, జనరల్ సర్జరీ, న్యూరో ఫిజీషియన్, డెంటల్, ఈఎన్‌టీ విభాగాలకు చెందిన వైద్యులు సేవలందించారు. అవసరమైన 50 మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ నితికా పంత్ మాట్లాడుతూ ప్రజలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ముందస్తు వైద్య పరీక్షల ద్వారా అనేక వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి నివారించవచ్చని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఇలాంటి ఉచిత శిబిరాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.
ప్రజల భద్రతతో పాటు వారి ఆరోగ్య సంక్షేమం పట్ల కూడా పోలీసు శాఖ బాధ్యతతో పనిచేస్తోందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ఎస్పీ తెలిపారు. ఏవైనా సమస్యలు ఎదురైతే సమీప పోలీస్ స్టేషన్ లేదా డయల్ 100ను సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కాగజ్‌నగర్ డీఎస్పీ వాహిదుద్దీన్, కౌటాల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ కుమార్, బెజ్జూర్ ఎస్‌ఐ సర్తాజ్ పాషా, వైద్య బృందం సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








