నిజామాబాద్ : దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రాష్ట్రీయ వికలాంగ్ పార్టీ (ఆర్వీపీ) రాష్ట్ర అధ్యక్షుడు ఇసాక్ అలీ డిమాండ్ చేశారు. ఆదివారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎన్నికల సమయంలో దివ్యాంగులకు ఇచ్చిన హామీల ప్రకారం రూ.6 వేల పెన్షన్‌తో పాటు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. 2016 వికలాంగుల హక్కుల చట్టంపై అధికారులు, దివ్యాంగులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారి హక్కులను పరిరక్షించాలని సూచించారు.
స్త్రీ సంక్షేమ శాఖ నుంచి వికలాంగుల శాఖను వేరు చేసి దివ్యాంగులకు ప్రత్యేక న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని దివ్యాంగుల పెన్షన్లు సైతం నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. చేయూత పథకం కింద మంజూరైన కొత్త పెన్షన్లను వెంటనే విడుదల చేయాలని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కూడా దివ్యాంగులకు 5 శాతం ఇళ్లు కేటాయించాలని కోరారు. అర్హులైన ప్రతి దివ్యాంగునికి రెట్రో ఫిటెడ్ వాహనాలు అందించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
ఆర్వీపీ తరఫున ఉంచిన డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టి హక్కులు సాధించుకుంటామని ఇసాక్ అలీ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో డా. ఆసిమ్, పోశెట్టి, ముత్యం, ఖలీం, లక్ష్మి, భారతి, లక్ష్మణ్, సాబీర్ హుస్సేన్, చరణ్, సౌమ్య, శివకుమార్, నిర్మల్ జిల్లా ఇంచార్జి తదితరులు పాల్గొన్నారు.








