కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్‌నగర్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ సిర్పూర్ నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై కాంగ్రెస్ నాయకులు ధర్నాలు, పోరాటాలు నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోందని ఎస్పీఎం (SPM) కార్మిక సంఘాల ఫోరం అధ్యక్షుడు నగరం గణపతి విమర్శించారు.
మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికుల సమస్యలపై, తాజాగా పోడు రైతుల సమస్యలపై కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి అదిత ఆందోళనలు చేపట్టడంపై ప్రజల్లో చర్చ జరుగుతోందన్నారు. అధికారంలో ఉన్న పార్టీ నాయకులు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ద్వారా చర్యలు తీసుకోవాల్సింది పోయి, ప్రతిపక్షం తరహాలో నిరసనలు చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్న నేపథ్యంలో జాతీయ స్థాయి నాయకత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నేరుగా మాట్లాడి స్థానిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, అలాంటి ప్రయత్నాలు చేయకుండా ధర్నాలు నిర్వహించడం వెనుక రాజకీయ ఉద్దేశాలున్నాయనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోందని అన్నారు.
సిర్పూర్ నియోజకవర్గానికి కొత్తగా వచ్చిన నాయకత్వం ప్రజల విశ్వాసం పొందేందుకు ఉద్యమాల పేరుతో రాజకీయ ప్రయోజనాలు పొందాలని ప్రయత్నిస్తోందని నగరం గణపతి ఆరోపించారు. ప్రజా సమస్యలపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వంతో సమన్వయం చేసి శాశ్వత పరిష్కారాలు తీసుకురావాలని, కేవలం నిరసనలతో సమస్యలు పరిష్కారం కావని ఆయన పేర్కొన్నారు.
అధికారంలో ఉన్న నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి సారించాలని నగరం గణపతి సూచించారు.








