కాకినాడ: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ఒక దశలో బ్యారెల్ ముడి చమురు ధర 120 డాలర్ల వరకు చేరగా ప్రస్తుతం అది సుమారు 70 డాలర్లకు తగ్గిందన్నారు. అయినప్పటికీ దేశంలో ఇంధన ధరల్లో తగ్గుదల కనిపించకపోవడం ప్రజలను తీవ్రంగా నిరాశకు గురిచేస్తోందని పేర్కొన్నారు.
ఇరాన్–ఇజ్రాయిల్–అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితులను కారణంగా చూపుతూ పెట్రోల్, డీజిల్ ధరలను నాలుగు దఫాలుగా, వంటగ్యాస్ ధరలను రెండు సార్లు పెంచారని ఆయన గుర్తు చేశారు. అయితే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గిన తర్వాత కూడా ఆ తగ్గుదలను వినియోగదారులకు అందించకపోవడం సమంజసం కాదన్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.117.70, డీజిల్ ధర రూ.105.70 ఉండటం సాధారణ ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం మోపుతోందన్నారు. చమురు సంస్థలు నిర్ణయించే మూల ధర సుమారు రూ.55 నుంచి రూ.60 మధ్యే ఉన్నప్పటికీ, కేంద్ర ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర వ్యాట్, డీలర్ కమిషన్లు, ఇతర సెస్‌ల కారణంగా వినియోగదారులు అధిక ధరలు చెల్లించాల్సి వస్తోందని వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌పై 31 శాతం వ్యాట్‌తో పాటు అదనంగా లీటరుకు రూ.4 ప్రత్యేక వ్యాట్, రూ.1 డెవలప్మెంట్ సెస్ వసూలు చేస్తున్నారని తెలిపారు. అలాగే డీజిల్‌పై 22.25 శాతం వ్యాట్‌తో పాటు రూ.4 అదనపు వ్యాట్, రూ.1 రోడ్ డెవలప్మెంట్ సెస్ విధించడం వల్ల ధరలు మరింత పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై లీటరుకు రూ.19.90, డీజిల్‌పై రూ.15.80 పన్నులు వసూలు చేస్తోందని, అదనంగా డీలర్ కమిషన్లు కూడా ఉండటంతో ప్రజలపై ఆర్థిక భారం మరింత పెరుగుతోందని ఆయన విమర్శించారు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరల వ్యత్యాసం ఎక్కువగా ఉండటానికి కారణాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
యుద్ధం పేరుతో పెంచిన ఇంధన ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ భారాన్ని తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని రమణరాజు కోరారు. లేకుంటే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి ప్రభుత్వాలకు ఎదురవుతుందని హెచ్చరించారు.








