contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పీపీపీతో ప్రజలపై చార్జీల భారం.. కార్మికుల ఉద్యోగాలకు ముప్పు

కాకినాడ: రాష్ట్రంలోని మున్సిపల్ సేవలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో ప్రైవేటీకరించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని పౌర సంక్షేమ సంఘం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు 2026 మే నెలలో జారీ చేసిన జీవోలు 673, 975లను తక్షణమే రద్దు చేయాలని సంఘం డిమాండ్ చేసింది.

పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు శనివారం విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ, పీపీపీ విధానం అమల్లోకి వస్తే ప్రజలపై అదనపు యూజర్ చార్జీల భారం పడటమే కాకుండా, మున్సిపల్ కార్మికుల ఉద్యోగ భద్రత కూడా ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ప్రతిపాదించిన విధానం ప్రకారం రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని సుమారు 14 కీలక విభాగాలను ప్రైవేట్ సంస్థలు, కాంట్రాక్టర్లకు అప్పగించే అవకాశం ఉందన్నారు. మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, పార్కులు, రహదారుల నిర్వహణ, మున్సిపల్ వాహనాల నిర్వహణ, ప్రజారోగ్య సేవలు వంటి కీలక పౌర సేవలు ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లనున్నాయని పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ శాఖల్లో పనిచేస్తున్న దాదాపు 60 వేల మంది కార్మికుల ఉపాధిపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుందని రమణరాజు అన్నారు. ప్రైవేట్ సంస్థల ఆధీనంలోకి సేవలు వెళ్తే కనీస వేతనాలు, పింఛన్, గ్రాట్యుటీ వంటి ఉద్యోగ హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందని కార్మికులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు.

స్థానిక సంస్థలకు ఎన్నికైన పాలకవర్గాలు లేకుండానే ఇలాంటి కీలక నిర్ణయాలను ఏకపక్షంగా అమలు చేయడం సరికాదని ఆయన విమర్శించారు. పీపీపీ విధానం అమలైతే స్థానిక సంస్థల ప్రజాసేవలు వ్యాపార కార్యకలాపాలుగా మారిపోయే ప్రమాదం ఉందని, భవిష్యత్తులో ఎన్నికయ్యే పాలకవర్గాలు నామమాత్రపు పాత్రకే పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.

స్థానిక సంస్థల ఆర్థిక సమస్యలకు పరిష్కారం ప్రైవేటీకరణ కాదని, ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన ఆస్తి పన్నుల వసూళ్లు, ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారించాలని సూచించారు. ప్రజల ఆస్తులు పేరుకు మాత్రమే ప్రభుత్వ ఆధీనంలో ఉండి, వాటి ద్వారా లాభాలు మాత్రం ప్రైవేట్ సంస్థలకే వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని ఆరోపించారు.

ప్రజలపై భారాలు మోపే, కార్మికుల జీవనోపాధిని దెబ్బతీసే జీవోలు 673, 975లను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ నిర్ణయంపై ప్రజల్లో వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతోందని, ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే రాజకీయంగా మూల్యం చెల్లించాల్సి వస్తుందని రమణరాజు హెచ్చరించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :