కాకినాడ: అయోధ్య ఆలయ నిధుల దుర్వినియోగంపై వెలువడుతున్న ఆరోపణలు అత్యంత దురదృష్టకరమని స్వయంభూ భోగిగణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర న్యాయ విచారణ జరిపించి, ఆరోపణలు రుజువైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, భక్తులు సమర్పించిన బంగారం, వెండి, వజ్రాభరణాలు, నగదు వంటి విరాళాలు ఆలయ ఖజానాకు చేరకుండా దుర్వినియోగానికి గురయ్యాయనే ఆరోపణలు వెలువడటం హిందూ సమాజాన్ని కలచివేస్తోందన్నారు. ఈ ఆరోపణల్లో వాస్తవాలు తేల్చేందుకు స్వతంత్ర న్యాయ విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు బాధ్యులపై చట్టప్రకారం అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆలయాలపై భక్తుల విశ్వాసాన్ని కాపాడాలంటే పారదర్శక పరిపాలనతో పాటు విరాళాల నిర్వహణలో పూర్తి జవాబుదారీతనం అవసరమని పేర్కొన్నారు.
అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా దశాబ్దాల పాటు సాగిన ఆధ్యాత్మిక ఉద్యమాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రతి హిందూ ఇంటి నుంచి శ్రీరామ నామంతో ఇటుకలను సేకరించే కార్యక్రమం ద్వారా సమాజంలో విశేష చైతన్యం తీసుకొచ్చారని అన్నారు. అలాంటి పవిత్ర క్షేత్రం పేరుతో ఎలాంటి వివాదాలు లేదా అవినీతి ఆరోపణలు రావడం బాధాకరమని వ్యాఖ్యానించారు.
దేవాలయాలకు భక్తులు సమర్పించే ధనాన్ని దుర్వినియోగం చేయడం అత్యంత తీవ్రమైన నైతిక, ఆధ్యాత్మిక తప్పిదమని రమణరాజు పేర్కొన్నారు. గరుడ పురాణంలో దేవాలయ సంపదను అపహరించడం వల్ల కలిగే పాపఫలితాల గురించి ప్రస్తావించారని, ధర్మాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన అన్నారు.








