- పత్రికా సమావేశంలో వెల్లడించిన ఎస్పీ బిందు మాధవ్
పిఠాపురం : కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణ పోలీసులు చోరీకి గురైన 48 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. ఈ సంధర్భంగా పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం గత కొంతకాలంగా మాస్క్‌లు పెట్టి ఓ ముఠా బైకులు చోరీ చేస్తోందని, వారిలో అంతర్ జిల్లా దొంగను పిఠాపురం సర్కిల్ పోలీసులు పట్టుకున్నారన్నారు. అతడి దగ్గర నుంచి 48 బైకులు స్వాధీనం చేసుకున్నారు. దుండగుడు పిఠాపురానికి చెందిన సొంటిని గంగాధర్ అలియాస్ రీసు గంగాధర్‌గా గుర్తించారు. గతంలో పిఠాపురం, తుని, కాకినాడ, సర్కిల్‌తో పాటు అనకాపల్లి జిల్లాలో పలు బైకులు గంగాధర్ చోరీ చేశాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా గంగాధర్‌ని పట్టుకోవడంలో పిఠాపురం పోలీసులు చక్కని ప్రతిభ కనబరిచారని ఎస్పీ తెలిపారు. అదే విధంగా గంగాధర్ వద్ద బైకులను కొనుగోలు చేసిన ఆరుగురు వ్యక్తులను కూడా అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ డిఎస్పీ పాటిల్ డేవరాజ్ మనీష్, పిఠాపురం పట్టణ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ జి.శ్రీనివాస్, పట్టణ ఎస్సై వడ్డాడి మణికుమార్, అడిషనల్ ఎస్సై షేక్ జానీ బాషా, యు.కొత్తపల్లి ఎస్సై జి.వెంకటేష్, పిఠాపురం రూరల్ ఎస్పై ఎల్.గుణశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.