contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి.. శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం: సీపీ గౌష్ ఆలం

కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి, ప్రజలకు భద్రతా వాతావరణం కల్పించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశించారు. గురువారం కమిషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

సీపీ గౌష్ ఆలం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అధికారులు తమ పరిధిలోని పెండింగ్ కేసుల డైరీలు (సీడీ ఫైల్స్) సమర్పించి, కేసుల దర్యాప్తు పురోగతిని వివరించారు. ముఖ్యంగా 2024 వరకు పెండింగ్‌లో ఉన్న కేసులు, ఈ ఏడాది నమోదైన తీవ్రమైన నేరాలపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు.

ఆస్తి సంబంధిత నేరాలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, పోక్సో చట్టం కింద నమోదైన కేసుల్లో దర్యాప్తు వేగవంతం చేయాలని సీపీ స్పష్టం చేశారు. బాధితులకు త్వరిత న్యాయం అందేలా అధికారులు చురుకుగా వ్యవహరించాలని సూచించారు.

రైతుల సమస్యలపైనా సమావేశంలో చర్చ జరిగింది. వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.

నగరంలో ‘విజిబుల్ పోలీసింగ్’ మరింత స్పష్టంగా కనిపించేలా చర్యలు చేపట్టాలని, రాత్రి పగలు తేడా లేకుండా పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. డయల్-100 ద్వారా వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని స్పష్టం చేశారు.

రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా కొనసాగించాలని, వారి ఇళ్లపై ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే హోటళ్లు, లాడ్జీలలో సరైన గుర్తింపు కార్డులు, ఫోన్ నంబర్లు ధృవీకరించిన తర్వాతే గదులు అద్దెకు ఇవ్వాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇటీవల జరిగిన నేపాలీ ముఠాల ఘటనల నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న నేపాలీ కార్మికుల వివరాలను పోలీస్ స్టేషన్ వారీగా నమోదు చేయాలని సీపీ సూచించారు. బ్యాంకులు, జ్యువెలరీ షోరూమ్‌లలో సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించి భద్రతా ప్రమాణాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్, నంబర్ ప్లేట్ లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని, కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్‌ల ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు. సైబర్ నేరాలపై గ్రామాలు, వార్డుల్లో విస్తృత ప్రచారం చేపట్టాలని తెలిపారు.

మహిళా పోలీస్ సిబ్బందికి ‘బ్లూ కోల్ట్స్’ విధులు కేటాయించాలని సూచించిన సీపీ, రానున్న బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణాను అడ్డుకునేలా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అదేవిధంగా కమిషనరేట్ పరిధిలో మరిన్ని సీసీ కెమెరాల ఏర్పాటు కోసం కృషి చేయాలని, ఇప్పటికే ఉన్న కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూసుకోవాలని, వాటి జియో-ట్యాగింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

ఈ సమావేశంలో ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్, అదనపు డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు శ్రీనివాస్, వేణుగోపాల్, విజయకుమార్, వెంకటస్వామి, మాధవి, సతీష్, ప్రతాప్‌తో పాటు కమిషనరేట్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :