- వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సందేశాలతో షాక్‌కు గురైన భర్త
- డోర్నకల్ పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు.. కేసు సంబంధిత పోలీస్ స్టేషన్‌కు బదిలీ
డోర్నకల్ : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామంలో వివాహేతర సంబంధం, హత్య కుట్ర ఆరోపణలతో కూడిన ఘటన సంచలనం రేపుతోంది. తనను హత్య చేయాలని ప్రియుడికి భార్య వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సందేశాలు పంపిందని ఆరోపిస్తూ ఓ భర్త పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు డోర్నకల్ పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం.
చిలుకోడు గ్రామానికి చెందిన గాదే రాజేశ్వరరావుకు 2016లో సూర్యాపేట జిల్లాకు చెందిన భవానితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే కొంతకాలంగా తన భార్యకు సైదులు అనే కొరియర్ బాయ్‌తో వివాహేతర సంబంధం కొనసాగుతోందని రాజేశ్వరరావు ఆరోపించారు.
గత నెల 27న ఈ విషయం తనకు తెలిసిన అనంతరం గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. అనంతరం తన అన్నను తీసుకురావడానికి వెళ్తున్న సమయంలో సైదులు తనను వెంబడించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్న తర్వాత భార్య మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా, తనను ఎలాగైనా చంపాలని, లేదంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని సైదులుకు పంపినట్లు చెబుతున్న వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ చాటింగ్‌ను గుర్తించినట్లు రాజేశ్వరరావు ఆరోపించారు.
ఈ చాటింగ్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్లను సేకరించిన రాజేశ్వరరావు, తన భార్య భవాని మరియు సైదులుపై డోర్నకల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఫిర్యాదుదారు గత పదేళ్లుగా ఖమ్మంలో నివసిస్తున్నారని, ఫిర్యాదులో పేర్కొన్న ఘటనలు కూడా ఖమ్మం పోలీస్ పరిధిలోనే జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు, నిబంధనల ప్రకారం కేసును సంబంధిత పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు సమాచారం.
ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం భర్త చేసిన ఆరోపణలు, సమర్పించిన డిజిటల్ ఆధారాలను విచారణలో పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న భార్య, మరో వ్యక్తి స్పందన అధికారికంగా వెలువడాల్సి ఉంది.








