మెదక్ జిల్లా – తూప్రాన్ : అకాల వర్షాల కారణంగా తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వమే వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి ఎమ్మెల్యే Sunita Laxma Reddy ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలోని వెల్దుర్తి నుంచి నర్సాపూర్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై రైతులతో కలిసి ఆమె రాస్తారోకో, బైఠాయింపు ఆందోళన చేపట్టారు.
అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసి మొలకెత్తిన పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, ప్రభుత్వం “చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం” అని హామీ ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం తడిసిన ధాన్యం కొనుగోలు విషయంలో జాప్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. రైతుల కష్టాన్ని పట్టించుకోకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆమె విమర్శించారు.
వాతావరణ శాఖ ముందుగానే వర్ష సూచన ఇచ్చినప్పటికీ సరైన ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ధాన్యం మొలకెత్తే పరిస్థితి ఏర్పడిందని రైతులు, ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మొలకెత్తిన ధాన్యం పరిస్థితి ఏంటని ప్రశ్నించిన ఎమ్మెల్యే, రైతుల పంటను మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేసి న్యాయం చేయాలని స్పష్టం చేశారు. రైతుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రహదారిపై జరిగిన ఈ ధర్నా కారణంగా కొంతసేపు రాకపోకలు నిలిచిపోయాయి.








