జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన యోగ గురువు డా. రాజా రత్నాకర్ జల యోగ (వాటర్ యోగా) ద్వారా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. సాధారణంగా నేలపై యోగాసనాలు వేయడం అందరికీ తెలిసిన విషయమే. అయితే నీటిపై యోగ సాధన చేసి, దాని ప్రయోజనాలను ప్రజలకు పరిచయం చేస్తూ ఆయన ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఆయన చేస్తున్న విశేష కృషి ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
గత 25 సంవత్సరాలుగా యోగా శిక్షకుడిగా సేవలందిస్తున్న డా. రాజా రత్నాకర్ తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో యోగా శిక్షణ ఇచ్చారు. యోగాను మరింత విభిన్నంగా ప్రజలకు చేరువ చేయాలనే సంకల్పంతో గత ఏడు సంవత్సరాలుగా జల యోగపై ప్రత్యేక పరిశోధనలు చేపట్టారు. ఐదేళ్లకు పైగా నిరంతర కృషి ఫలితంగా నీటిపై సులభంగా సాధన చేయగలిగే పలు యోగాసనాలను అభివృద్ధి చేసి, ఆసక్తి ఉన్నవారికి శిక్షణ అందిస్తున్నారు.
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ఒత్తిడి, ఆందోళనలు ప్రతి ఒక్కరినీ వెంటాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో జల యోగ సాధన ద్వారా శరీరంలోని అన్ని కండరాలు ఒకేసారి చురుకుగా పనిచేస్తాయని, ఫలితంగా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని రాజా రత్నాకర్ వివరిస్తున్నారు.
ఈ సందర్భంగా ‘ది రిపోర్టర్ టీవీ’తో మాట్లాడిన డా. రాజా రత్నాకర్, యోగా శిక్షకుడిగా 25 ఏళ్ల అనుభవం కలిగి ఉన్నానని తెలిపారు. నేలపై యోగా చేసే ప్రయోజనాలను నీటిలో కూడా అనుభవించవచ్చనే ఉద్దేశంతో జల యోగ సాధనపై దృష్టి సారించినట్లు చెప్పారు. అష్టాంగ యోగలోని ధ్యాన స్థితిలో కలిగే విదేహ అనుభూతిని జల యోగ ద్వారా కూడా పొందవచ్చని వివరించారు.
మానవ శరీరంలో సుమారు 70 శాతం నీరు ఉంటుందని, అందువల్ల నీటికి మన శరీరంతో అవినాభావ సంబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. తల్లి గర్భంలోని ఉమ్మనీటిలో శిశువు పొందే ప్రశాంత అనుభూతిని జల యోగ సమయంలో కూడా అనుభవించవచ్చని చెప్పారు. నేలపై చేసే యోగ వల్ల కలిగే అన్ని ప్రయోజనాలు జల యోగ ద్వారా కూడా పొందవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.
జల యోగ శిక్షణ పొందుతున్న కిషోర్ కుమార్, శ్యాంసుందర్ మాట్లాడుతూ, సాధారణ యోగతో పోలిస్తే జల యోగ ఒక ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుందని చెప్పారు. శవాసనం, వృక్షాసనం, తాడాసనం వంటి పలు ఆసనాలను నీటిపై నేర్చుకున్నామని తెలిపారు. నీటిలో యోగాసనాలు వేయడం ద్వారా శరీరం తేలికగా అనిపించడంతో పాటు మనసుకు ప్రశాంతత లభిస్తోందని వారు పేర్కొన్నారు.
విభిన్న ఆలోచనతో యోగాకు కొత్త రూపాన్ని అందిస్తున్న డా. రాజా రత్నాకర్ కృషి మెట్పల్లికే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా యోగా ప్రియులను ఆకట్టుకుంటోంది. యోగాను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆయన సంకల్పం పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది.








