భారత దేశాన్ని ప్రపంచంలోనే తయారీ హబ్ గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని.. ఆ దిశగా మంచి పురోగతి సాధిస్తున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కరోనా వైరస్, ఉక్రెయిన్–రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆహార, ఇంధన సంక్షోభాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఉజ్బెకిస్థాన్ లో జరుగుతోన్న షాంఘై సహకార సంస్థ (ఎస్ సీఓ) సదస్సులో మోదీ ప్రసంగించారు.
పరస్పరం సహకరించుకోవాలి
ఆహార, ఇంధన సరఫరాలో ఆటంకాలను తొలగించి.. మెరుగైన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉందని సభ్య దేశాలకు మోదీ పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రాంతీయ కూటమి దేశాలు పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. ఈ విషయంలో కూటమి దేశాల మధ్య పరస్పర విశ్వాసం, సహకారానికి భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ప్రతి రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్న భారత్.. ఎస్ సీవో దేశాలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం దేశంలో 70 వేల స్టార్టప్ లతోపాటు వందకుపైగా యూనికార్న్ సంస్థలు ఉన్నాయని చెప్పారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలవడం సంతోషకరమన్నారు.
భారత్ లో సదస్సు నిర్వహణకు చైనా మద్దతు
ఎస్ సీవో సదస్సు సందర్భంగా ప్రాంతీయ భద్రత, వాణిజ్యాన్ని మరింత మెరుగుపర్చుకోవడం, అవసరమైన సదుపాయాల కల్పనపై ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇతర కూటమి దేశాల అధినేతలు చర్చలు జరిపారు. వచ్చే ఏడాది ఎస్ సీవో సదస్సుకు భారత్ అధ్యక్షత వహించడానికి చైనా పూర్తి మద్దతు ప్రకటించింది.