కరీంనగర్ జిల్లా- గన్నేరువరం: గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని గన్నేరువరం సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు తీగల మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
పెండింగ్ బిల్లుల విడుదల కోసం జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్లోని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడించేందుకు బయలుదేరిన బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంప వెంకన్న, మాజీ సర్పంచుల నాయకుడు తీగల మోహన్ రెడ్డిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి గన్నేరువరం పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా గంప వెంకన్న మాట్లాడుతూ, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరినందుకే మాజీ సర్పంచులను అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. సర్పంచులుగా ఉన్న సమయంలో అప్పులు చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు సంఘ భవనాల నిర్మాణం వంటి పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులకు సంబంధించిన బిల్లులు ఇప్పటికీ పెండింగ్లో ఉండటంతో మాజీ సర్పంచులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. బిల్లులు అందక అప్పుల భారం పెరిగి కొందరు మాజీ సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయని గుర్తు చేశారు. మరికొందరు అప్పుల ఊబిలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులను విడుదల చేసి మాజీ సర్పంచులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.








