తుని : “పేదల సేవలో” కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu సోమవారం కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని చామవరం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా కల్లుగీత కార్మికుడు పోలరపు సింహాచలం ఇంటికి స్వయంగా వెళ్లి ఆయనకు రావాల్సిన పింఛన్‌ను అందజేశారు.
సింహాచలం కుటుంబ సభ్యులతో ముచ్చటించిన ముఖ్యమంత్రి వారి కుటుంబ పరిస్థితులు, జీవన విధానం గురించి ఆరా తీశారు. కల్లుగీత వృత్తిలో ఎదురయ్యే కష్టనష్టాలు, ఆదాయం, ఉపాధి అవకాశాల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమకు సొంత ఇల్లు లేదని సింహాచలం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించిన చంద్రబాబు, ఆ కుటుంబానికి పక్కా ఇల్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం తాటి చెట్టు నుంచి కల్లు తీసే విధానాన్ని ముఖ్యమంత్రి ఆసక్తిగా పరిశీలించారు. గీత కార్మికులు తాజాగా తీసిన తాటి కల్లును రుచి చూసి వారితో కొద్దిసేపు ముచ్చటించారు. గ్రామీణ జీవన విధానం, సంప్రదాయ వృత్తుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ పర్యటనకు సంబంధించిన వివరాలు, చిత్రాలను ముఖ్యమంత్రి తన సామాజిక మాధ్యమ వేదికలో పంచుకున్నారు. పేదల సంక్షేమం, వారి జీవన ప్రమాణాల మెరుగుదలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన మరోసారి స్పష్టం చేశారు.
చంద్రబాబు గ్రామ పర్యటనతో చామవరం గ్రామంలో ఉత్సాహ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి నేరుగా ఇంటికి వచ్చి సమస్యలు తెలుసుకోవడం పట్ల సింహాచలం కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.








