రావికమతం: అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ పరిధిలోని 16 గిరిజన గ్రామాల ఉపాధి హామీ కూలీలు ఫేస్ యాప్ విధానంలో మార్పులు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామంలో సుమారు 570 మంది జాబ్ కార్డు దారులు ఉపాధి పనుల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు.
వేసవి కాలంలో ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో రోజుకు రెండు సార్లు ఫేస్ యాప్ ద్వారా హాజరు నమోదు చేయడం వల్ల కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఫేస్ యాప్ నమోదు కోసం ఎక్కువ సమయం వృథా అవుతోందని తెలిపారు. రోజుకు ఐదు గంటలపాటు పని చేస్తే దాదాపు రెండు గంటల సమయం ఫేస్ యాప్ హాజరు నమోదుకే సరిపోతుందని పేర్కొన్నారు.
అందువల్ల ఫేస్ యాప్‌ను పూర్తిగా రద్దు చేయాలని, లేదంటే రోజుకు ఒక్కసారి మాత్రమే హాజరు నమోదు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే మండుతున్న ఎండల నేపథ్యంలో ఉపాధి కూలీలకు మజ్జిగ సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు.
తమ సొంత భూముల్లోనే ఉపాధి పనులు కల్పించాలని, గ్రామాల్లో ఉన్న జీడి, మామిడి తోటలు మరియు చెరువుల అభివృద్ధి పనులను ఉపాధి హామీ పథకం కింద చేపట్టాలని కోరారు.
గతంలో ఇద్దరు విఆర్‌పీలు పనిచేసేవారని, ప్రస్తుతం ఒక్క విఆర్‌పీ మాత్రమే ఉండటంతో పనిభారం పెరిగి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వెంటనే రెండో విఆర్‌పీ పోస్టును భర్తీ చేసి కూలీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కే. గోవిందరావు, గెమ్మిలి భాస్కరరావు, కొర్ర మహేష్, పాంగి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.








