- ఎమ్మెల్యే భూమి కోసం….. దర్జాగా దోపిడీ
- మూసాపేటలో మట్టి మాఫియా
- మూడు రోజులుగా 15 ట్రిప్పర్లలతో దర్జాగా మట్టి అక్రమ రవాణా
- చోద్యం చూస్తున్న రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులు
- అక్రమ మట్టి రవాణాను అడ్డుకుంటాం
- సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్
ఏమండీ కరణం గారు పాతరలో పడ్డారంట అంటే…..కాదు కాదు మషాకత్తు చేస్తున్నాను అన్నాడట అన్న చందంగా తయారైంది మూసాపేటలో మట్టి మాఫియా . ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం రామస్వామి గుట్టను గత మూడు రోజులుగా ఇటాచీలతో మట్టిని తవ్వి అక్రమ రవాణా చేస్తున్న పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. గత మూడు రోజులుగా 15 ట్రిప్పర్లతో గుట్టలోని మట్టిని దర్దాగా అక్రమ రవాణా చేస్తూ ఇదేమిటని ప్రశ్నిస్తే ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి భూమి కోసం తీసుకెళ్తున్నామని సదరు ట్రిప్పర్ యజమానులు, కాంట్రాక్టర్లు చెప్పడం గమనర్హం. మూసాపేట మండల పరిధిలోని గౌరీదేవిపల్లి గ్రామంలో దేవరకద్ర ఎమ్మెల్యే గత 3,4 సంవత్సరాల క్రితం దాదాపు 30 నుంచి 40 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమి కోసం పక్కనే ఉన్న వాగులో ఏకంగా ఓ బావి తవ్వి అక్కడి నుండి సదరు పొలానికి పైపులైన్ వేసుకున్నట్లు కూడా అప్పట్లో పెద్దఎత్తున ఆరోపణలు వెలువెత్తాయి.
అప్పట్లో కేవలం రెండున్నర నుంచి మూడు లక్షలు పలికే సదరు భూమిని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి స్వంత పార్టీకి చెందిన ఓ సర్పంచ్, మండల స్థాయి ఓ ప్రజాప్రతినిధి, పార్టీ మండల స్థాయి బాధ్యలు ఏకంగా ఏడున్నర నుంచి ఎనిమిది లక్షలకు అమ్మి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డికే టోకర పెట్టి అప్పట్లో పెద్దఎత్తున కమీషన్లు దండుకున్నారని టిఆర్ఎస్ పార్టీలోని పెద్దఎత్తున ధుమారం రేగింది. సాక్ష్యాత్తు ఎమ్మెల్యేకే సావ్డ్ భూమిని అమ్మి లక్షల్లో కమీషన్లు కొట్టి…. స్వంత ఎమ్మెల్యే కుచ్చుపోటీ పెట్టారని మూసాపేట మండలంతో పాటు నియోజకవర్గం మొత్తం స్వంత పార్టీలో పెద్దఎత్తున రచ్చ…. రచ్చ అయ్యేంది
ఇదిలా ఉంటే చౌడు భూమితో సరిగ్గా వ్యవసాయం చేయలేక సతమతవుతున్న ఎమ్మెల్యే గత కొంతకాలంగా ఆ భూమిని అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. ఇక్కడ కూడా సదరు ఆ ముగ్గురు మొనగాళ్ళు అమ్మకంలో కూడా కమీషన్ల కోసం కక్కుర్తి పడి దాదాపు 30 లక్షలు పలికే భూమికి 20 నుంచి 25 లక్షలంటూ ఎమ్మెల్యేకు కాకమ్మ కథలు చెబుతూ వస్తున్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో సదరు భూమిని అమ్మేందుకు ఆ ముగ్గురు నేతలు కాకుండా మరో వ్యక్తి ప్రయత్నించగా, సదరు ముగ్గురు కమీషన్ల కక్కుర్తి పడే స్వంత పార్టీ నేతల అసలు బండారం ఎమ్మెల్యే దృష్టికి వచ్చినట్లు సమాచారం. దీంతో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి స్వయంగా ఆ నేతలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
ఈ నేపథ్యంలోనే సావ్డ్ భూమితో సమస్యలు ఎందుకని, ఆ భూమిని ఎట్లగానైనా అమ్మాలని నిర్ణయించుకోవడంతో ఆ భూమికి వెళ్ళేందుకు కొత్తగా బాటకు గుంటకు లక్ష రూపాయల చొప్పున ఊరుపక్క నుంచి రైతుల నుంచి కొనుగోలు చేశారు. బాట కోసం ఏర్పాటు చేసుకునేందుకు ఈ మట్టి కోసం రామస్వామి గుట్టను ఎంపిక చేసినట్లు సమాచారం. గత మూడు రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా గుట్ట నుండి 15 ట్రిప్పర్లతో సదరు భూమికి రోడ్డు వేసేందుకు ప్రయత్నిస్తుండగా, శనివారం ఈ తతంగమంతా కొందరు నేనుసైతం స్వచ్చంద సంస్ధ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో వెంటనే స్పందించిన సామాజిక కార్యకర్త , నేనుసైతం స్వచ్చంద సంస్ధ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ ఈ మొత్తం వ్యవహారంపై ఆరా తీశారు. ఈ విషయమై మూసాపేట తహిసిల్దార్ మంజులకు, ఎస్ఐ నరేష్ కు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా అక్రమ మట్టి రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారి వాహనాలను జప్తు చేయాలని డిమాండ్ చేశారు.
విఆర్ఎను అక్కడే పెట్టాం: తహిసిల్దార్ మంజుల
మూసాపేట మండలం రామస్వామి గుట్ట నుండి కొందరు అక్రమ మట్టి రవాణా చేస్తున్నారని ఫిర్యాదు అందిన వెంటనే తాను స్వయంగా ఓ విఆర్ఎను అక్కడికి పంపడం జరిగిందని, అక్కడి నుండి మట్టి తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని, అక్రమ రవాణా చేసిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని తహిసిల్దార్ మంజుల తెలిపారు.అంతేకాకుండా మూసాపేట ఎస్ఐని సంఘటన స్ధలానికి పంపించడం జరిగిందని, అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని ఆమె హామి ఇచ్చారు.
చర్యలు తీసుకుంటాం: ఎస్ఐ నరేష్
రామస్వామి గుట్ట నుండి అక్రమ మట్టి రవాణా చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మూసాపేట ఎస్ఐ నరేష్ తెలిపారు. అక్రమ మట్టి రవాణా చేస్తే సహించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అక్రమ రవాణాను అడ్డుకుంటాం: దిడ్డి ప్రవీణ్ కుమార్
మూసాపేట మండలంలోని రామస్వామి గుట్టలో నిబంధనలకు విరుద్దంగా గత మూడు రోజులుగా అక్రమంగా మట్టి రవాణా చేస్తున్నారని, అక్రమార్కులపై చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్చంద సంస్ధ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా దర్జాగా అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న స్ధానిక రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప’ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆయన మండిపడ్డారు. మూడు రోజులుగా ఈ అక్రమ రవాణా కొనసాగుతున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.
అక్రమ రవాణా చేస్తున్న వారు గౌరిదేవిపల్లి గ్రామంలో దర్జాగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పొలానికి బాట కోసం కొడుతున్నామని బహిరంగంగా చెప్పడంతో ఈ విషయమై నేనుసైతం దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిని వివరణ కోరగా, ఆ భూమికి తనకు సంబంధం లేదని పేర్కొనడంతో పాటు తన పేరు చెప్పి అక్రమ మట్టి రవాణా చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని, కేసులు పెట్టండని చెప్పడం కొసమెరుపు. ఇదిలా ఉంటే దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి దృష్టికి ఈ అక్రమ మట్టి రవాణ విషయం రావడంతో *వాస్తవానికి ఎమ్మెల్యే ఆలకు ఈ అక్రమ మట్టి రవాణాకు సంబంధం లేకుంటే మూసాపేట తహిసిల్దార్, ఎస్ఐలకు ఆయన స్వయంగా ఫోన్ చేసి ఈ అక్రమ మట్టి రవాణా చేసిన మాఫియాపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇచ్చేవారు కదా అని పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రేపుయిన ఈ అక్రమ మట్టి రవాణపై ఎమ్మెల్యే ఆల స్పందించి అసలు దోషులెవరో…. అక్రమంగా మట్టి రవాణా చేసే మాఫియా వివరాలను మూసాపేట మండల ప్రజలతో పాటు….. దేవరకద్ర నియోజకవర్గ ప్రజల ముందుంచి తన నిజాయితీని నిరూపించుకుంటారో….. లేదో…… వేచి చూద్దాం.