ఇందూరు: ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండర్ రవిశంకర్ నేతృత్వంలో బెంగుళూరులో జరుగుతున్న 45వ వార్షికోత్సవ వేడుకల్లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ధ్యానం, యోగ, సత్సంగ్ తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకలతో పాటు ఫౌండర్ రవిశంకర్ 70వ జన్మదినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇలాంటి మహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల్లో 10 వేలకుపైగా కేంద్రాలను నిర్వహిస్తూ, ప్రజలను ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మికత వైపు నడిపిస్తున్న గొప్ప సంస్థగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిలిచిందని కొనియాడారు. ఆధ్యాత్మికవేత్త రవిశంకర్ అనేక ఆశ్రమాలను స్థాపించడమే కాకుండా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వేడుకల్లో పాల్గొని ధ్యాన మందిరాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. ఆ ధ్యాన మందిరంలో అడుగుపెట్టడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు.








