contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

భావి తరాలను తీర్చిదిద్దే బాధ్యత గురువులదే : ఎమ్మెల్యే ధన్‌పాల్

నిజామాబాద్ – ఇందూరు : చక్కటి విద్యాబుద్ధులు నేర్పించి భావి తరాలను తీర్చిదిద్దే గురుతర బాధ్యతను ఉపాధ్యాయులు సమర్థవంతంగా నిర్వహించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యా వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఆదివారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ భావి భారత పౌరులైన విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించాల్సిన బాధ్యత గురువులపై ఉందన్నారు. సమాజంలో ఉపాధ్యాయులకు ఉన్న గౌరవం, స్థానం ఎంతో గొప్పదని పేర్కొన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దాలనే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా విద్యార్థులను ఉన్నత ప్రమాణాలతో కూడిన పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను కోరారు.

ప్రభుత్వ పాఠశాలలు ప్రస్తుతం ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధిస్తున్నాయని, నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ బడుల విద్యార్థులు సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనమన్నారు. విద్యార్థులు కేవలం మార్కులకే పరిమితం కాకుండా నాణ్యమైన విద్యను ఆర్జించాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ విద్యార్థి దశ ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కీలకమని అన్నారు. స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగుతూ తమ కలలను నిజం చేసుకోవాలని సూచించారు. పదో తరగతి అనంతరం ఎంచుకునే కోర్సులు, సబ్జెక్టులు భవిష్యత్తును నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. తాము ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునే దిశగా అంకితభావంతో కృషి చేస్తే విజయం సాధించవచ్చన్నారు. స్మార్ట్‌ఫోన్లకు అలవాటు పడకుండా పుస్తక పఠనాన్ని అభిరుచిగా మలుచుకోవాలని విద్యార్థులకు సూచించారు.

అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, డీఈవో అశోక్, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు నర్సయ్య, కృష్ణవేణి, జిల్లా పౌరసంబంధాల అధికారిణి ఎన్. పద్మశ్రీ, డీసీఈబీ కార్యదర్శి సీతయ్య, జీఈసీఓ భాగ్యలక్ష్మి, ఎంఈవోలు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :