contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఆడి కృత్తిక మహోత్సవాలకు భారీ పోలీసు బందోబస్తు

పాకాల : పాకాల మండలంలోని ప్రసిద్ధ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో జరుగుతున్న 78వ ఆడి కృత్తిక మహోత్సవాల సందర్భంగా భక్తుల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ట్రాఫిక్ నిర్వహణ కోసం తిరుపతి జిల్లా పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఉత్సవాలు ప్రశాంతంగా, విజయవంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు పాకాల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ టి. చిన్న గోవిందు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ, ఉత్సవాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు పేర్కొన్నారు.

భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఒక డీఎస్పీ, నలుగురు సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, 26 మంది సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు సహా మొత్తం 268 మంది పోలీసు అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో నిరంతర నిఘా ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక బృందాలను మోహరించినట్లు తెలిపారు.

భక్తులు పోలీసు సిబ్బంది, దేవస్థాన అధికారులకు సహకరించాలని, ట్రాఫిక్ నిబంధనలు, క్యూలైన్ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని సీఐ టి. చిన్న గోవిందు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో వ్యవహరించి ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకోవాలని కోరారు.

ఉత్సవాల సందర్భంగా భక్తులకు భద్రత, సౌకర్యాల కల్పనకు జిల్లా పోలీసు శాఖ పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టిందని, ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే స్పందించేలా ప్రత్యేక పోలీసు బృందాలను సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :