పల్నాడు జిల్లా – అడిగొప్పల: కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులు కొలిచే అడిగొప్పల నిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారి ఆలయ అభివృద్ధికి చర్యలు వేగం పుంజుకుంటున్నాయి. ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆదివారాలు, పర్వదినాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చే సమయంలో రహదారి సమస్య మరింత ఇబ్బందికరంగా మారుతోంది.
ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి, పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయల దృష్టికి తీసుకెళ్లినట్లు శ్రీలక్ష్మీ అమ్మవారి ఆలయ శాశ్వత ధర్మకర్త యాగంటి వెంకటేశ్వర్లు తెలిపారు. సంబంధిత అధికారులకు కూడా అవసరమైన ప్రతిపాదనలు పంపించినట్లు చెప్పారు.
ప్రభుత్వ ఉత్తర్వుల కాపీ అందిన వెంటనే మాచర్ల–నరసరావుపేట రహదారి నుంచి ఆలయం వరకు సుమారు 20 అడుగుల వెడల్పుతో రహదారి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఈ రహదారి నిర్మాణంతో ఆలయానికి వచ్చే భక్తులకు ప్రయాణ ఇబ్బందులు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు.
ఆలయ పరిసరాల్లో చిన్నారులు, మహిళలు భిక్షాటన చేస్తున్న విషయం కూడా తమ దృష్టికి వచ్చిందని ధర్మకర్త తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా, ప్రశాంతంగా ఉంచేందుకు తగిన చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
దూర ప్రాంతాల నుంచి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రతి ఆదివారం అన్నదానం, వసతి, మంచినీటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు యాగంటి వెంకటేశ్వర్లు తెలిపారు. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.
ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు పలు ప్రతిపాదనలను ఉన్నతాధికారులకు పంపించినట్లు, వాటికి అనుమతులు లభించిన వెంటనే అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని తెలిపారు.
భవిష్యత్తులో అడిగొప్పల శ్రీలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని రాష్ట్ర స్థాయిలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని యాగంటి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి భక్తులు, స్థానిక ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.








