పార్వతీపురం మన్యం జిల్లా, ఏప్రిల్ 25: జియ్యమ్మవలస మండలం పెదమేరంగి జంక్షన్ వద్ద ఉన్న తిరుమల సాయి హైస్కూల్ మరోమారు తన ప్రతిభను చాటుకుంది. విద్యార్థుల్లో నైతిక విలువలు, సృజనాత్మకత పెంపొందించడంలో చూపుతున్న విశిష్ట కృషికి గాను 2025-26 విద్యా సంవత్సరానికి ‘బెస్ట్ స్కూల్ ఇన్నోవేషన్ అవార్డు’ను వరుసగా మూడవసారి అందుకుంది.
ఈ అవార్డు ప్రధానోత్సవం విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ ఆడిటోరియంలో అట్టహాసంగా జరిగింది. బిజ్ హబ్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో, ఈటీవీ జర్నలిస్ట్ మామిడి నాగరాజు సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మరియు ప్రవాస ఆంధ్రుల సంక్షేమ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా పాఠశాల ప్రతినిధులు పురస్కారం అందుకున్నారు.
ఈ కార్యక్రమానికి విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎం. భరత్, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషతో పాటు మెడిసిన్ హాస్పిటల్ డైరెక్టర్ శిరీష రాణి తదితర ప్రముఖులు హాజరై వేడుకను గౌరవించారు.
అవార్డు అందుకున్న సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ రౌతు సరళ కుమారి, ప్రధానోపాధ్యాయులు సతివాడ శంకరరావు మరియు ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి, వారిని బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషికి ఈ అవార్డు గుర్తింపుగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ విజయాన్ని పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రుల సమష్టి కృషి ఫలితంగా అభివర్ణించారు.
వరుసగా మూడవ ఏడాది కూడా ఈ ప్రతిష్టాత్మక అవార్డును సాధించినందుకు తిరుమల సాయి హైస్కూల్ యాజమాన్యాన్ని మండల ప్రజలు, విద్యావేత్తలు అభినందిస్తున్నారు.








