- విదేశీ విద్యపై మారిన దేశాల వైఖరి.. కఠినంగా కొత్త వీసా నిబంధనలు
- ఆర్థిక నిధుల రుజువు పరిమితిని గణనీయంగా పెంచిన పలు దేశాలు
- ‘జెన్యూన్ స్టూడెంట్’ నిబంధనతో కోర్సు, కెరీర్‌కు కచ్చితమైన అనుసంధానం తప్పనిసరి
- ఆస్ట్రేలియా, కెనడా, యూకేలలో పెరిగిన వీసా ఫీజులు, నిధుల నిల్వ
- విదేశీ విద్యకు కొత్త రూల్స్.. భారత విద్యార్థులకు కఠిన సవాళ్లు
విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే భారత విద్యార్థులకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తమ వీసా విధానాలను కఠినతరం చేస్తూ, “న్యూ వీసా రూల్స్ 2026” పేరుతో కొత్త మార్గదర్శకాలను అమలు చేస్తున్నాయి. గతంలోలా కేవలం విదేశీ విద్యార్థుల సంఖ్య పెంపుపై కాకుండా, తమ దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడే నైపుణ్యాలతో కూడిన అభ్యర్థుల ఎంపికపై దేశాలు దృష్టి సారిస్తున్నాయి.
2024 ఏప్రిల్ నుంచి 2026 మే మధ్యకాలంలో అంతర్జాతీయ విద్యా రంగంలో ఈ మార్పులు వేగంగా చోటుచేసుకున్నాయి. దీంతో విదేశీ విద్యకు సిద్ధమవుతున్న భారత విద్యార్థులు ఇప్పుడు మరింత జాగ్రత్తగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆర్థిక నిబంధనలు కఠినతరం
కొత్త నిబంధనల ప్రకారం విద్యార్థులు తమ ఖర్చులను స్వయంగా భరించగలరని నిరూపించాల్సి ఉంటుంది. పార్ట్‌టైమ్ ఉద్యోగాలపై ఆధారపడే అవకాశాలను తగ్గిస్తూ, ముందుగానే భారీ మొత్తంలో నిధులను చూపించడం తప్పనిసరి చేశారు. అలాగే IELTS, PTE వంటి ఆంగ్ల భాషా పరీక్షల్లో అధిక స్కోర్లు సాధించాల్సి ఉంది.
‘జెన్యూన్ స్టూడెంట్’ నిబంధన కీలకం
వీసా తిరస్కరణలకు ప్రధాన కారణంగా మారుతున్న అంశం ‘జెన్యూన్ స్టూడెంట్’ నిబంధన. విద్యార్థి ఎంచుకున్న కోర్సు, అతని గత విద్య, భవిష్యత్ కెరీర్ లక్ష్యాల మధ్య స్పష్టమైన అనుసంధానం ఉండాలి. ఇందులో ఏ చిన్న అనుమానం వచ్చినా వీసా నిరాకరణకు గురయ్యే అవకాశాలు పెరిగాయి.
దేశాలవారీగా కొత్త మార్పులు
ఆస్ట్రేలియా:
వీసా ఫీజులను పెంచడంతో పాటు ‘జెన్యూన్ స్టూడెంట్’ నిబంధనను కఠినంగా అమలు చేస్తోంది. విద్యార్థులు సంవత్సరానికి సుమారు 29,710 ఆస్ట్రేలియన్ డాలర్ల నిధులను చూపించాలి.
కెనడా:
SDS ఫాస్ట్-ట్రాక్ విధానాన్ని రద్దు చేసి, స్టడీ పర్మిట్‌లపై పరిమితి విధించింది. కనీసం 22,895 కెనడియన్ డాలర్ల ఆర్థిక రుజువు తప్పనిసరి.
యూకే:
వీసా ఫీజులు, ఆంగ్ల భాషా ప్రమాణాలు పెంచింది. పోస్ట్-స్టడీ వర్క్ వీసా కాలాన్ని తగ్గించే అంశాన్ని పరిశీలిస్తోంది. కొన్నికేటగిరీలలో డిపెండెంట్లకు వీసా పరిమితులు విధిస్తోంది.
అమెరికా:
వీసా ఇంటిగ్రిటీ ఫీజు ప్రవేశపెట్టి, ఇంటర్వ్యూ పరిశీలనను కఠినతరం చేసింది. అయితే STEM రంగాల్లో విద్యార్థులకు మెరుగైన పోస్ట్-స్టడీ వర్క్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
జర్మనీ:
తక్కువ ఖర్చుతో కూడిన విద్యను అందిస్తున్నప్పటికీ, 11,904 యూరోల బ్లాక్డ్ అకౌంట్ తప్పనిసరి. చదువు అనంతరం ఉద్యోగ అవకాశాల కోసం ‘ఆపర్చునిటీ కార్డ్’ను అందిస్తోంది.
న్యూజిలాండ్:
వీసా ప్రక్రియను సులభతరం చేసినప్పటికీ, ఏటా 20,000 న్యూజిలాండ్ డాలర్ల నిధులను చూపించాలి. పరిమిత పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, కోర్సు ఆధారిత వర్క్ అవకాశాలు మాత్రమే ఉన్నాయి.
విద్యార్థులకు సూచనలు
ఈ కొత్త నిబంధనల నేపథ్యంలో విదేశీ విద్యకు వెళ్లాలనుకునే విద్యార్థులు సరైన ప్రణాళికతో ముందుకు సాగాలి. సరైన కోర్సు ఎంపిక, ఆర్థిక ప్రణాళిక, పూర్తి పత్రాల సిద్ధం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. సమగ్ర అవగాహనతో దరఖాస్తు చేస్తే విదేశీ విద్య కలను సాకారం చేసుకోవడం సాధ్యమే.








