సంగారెడ్డి జిల్లా : ఝరాసంగం మండలం పుర్య నాయక్ తండాకు చెందిన ఓ మహిళ గురువారం ఆటోలోనే ప్రసవించింది. పురిటినొప్పులు రావడంతో ఆటోలో ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా రోడ్డుపై గుంతల కారణంగా మార్గమధ్యంలోనే ప్రసవం జరిగింది. మహిళ కుటుంబ సభ్యులు, తండా వాసుల వివరాల ప్రకారం.. పుర్య నాయక్ తండాకు చెందిన బానోతు స్వప్న నిండు చూలాలు. గురువారం ఉదయం పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆటోలో ఆమెను తీసుకుని ఝరాసంగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బయలుదేరారు.
రోడ్డు అధ్వానంగా, గుంతలమయంగా ఉండడంతో స్వప్నకు నొప్పులు ఎక్కువయ్యాయి. కొద్దిదూరం వెళ్లగానే ప్రసవం అయ్యే సూచనలు కనిపించడంతో ఆటోను రోడ్డు పక్కన ఆపి కుటుంబ సభ్యులు పురుడుపోశారు. విషయం తెలిసిన వెంటనే స్పందించిన మండల వైద్యాధికారులు తల్లీబిడ్డలను ఝరాసంగం ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వివరించారు. అత్యవసర వైద్య సేవలకు 108 కు ఫోన్ చేయాలని మండల వైద్యాధికారి డాక్టర్ రమ్య సూచించారు. అయితే, పుర్య నాయక్ తండాకు వెళ్లే రోడ్డు బాలేదని, వాహనాలు ఏవీ రావడంలేదని తండా వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే 108 కు ఫోన్ చేయలేదని వివరించారు.