రాజాం, శ్రీకాకుళం జిల్లా: రాజాం మున్సిపాలిటీ పరిధిలోని డోలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై హెడ్‌కానిస్టేబుల్ కుమారుడు దాడి చేసిన ఘటన శుక్రవారం ఉద్రిక్తతకు దారితీసింది. పాఠశాల ప్రధాన ద్వారానికి అడ్డంగా నిలిపిన కారును తొలగించాలని కోరడంతో ప్రారంభమైన వివాదం చివరకు హెడ్మాస్టర్ చాంబర్లోనే ఉపాధ్యాయుడిపై దాడికి దారితీసింది. ఈ ఘటనలో ఉపాధ్యాయుడు గాయపడగా, రాజాం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందారు.
ఉపాధ్యాయుల కథనం ప్రకారం, పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలిని దింపేందుకు ఆమె కుమారుడు కారులో పాఠశాలకు వచ్చాడు. కారు ప్రధాన గేటుకు అడ్డంగా నిలిపివేయడంతో ప్రార్థన కార్యక్రమానికి అంతరాయం కలుగుతుందని పాఠశాల పీఈటీ సుజాత వాహనాన్ని పక్కకు తీయాలని సూచించారు. స్పందన లేకపోవడంతో కారుపై చిన్న కర్రతో తట్టగా, దీనిపై యువకుడు ఆమెతో వాగ్వాదానికి దిగాడు.
ఈ ఘటనను గమనించిన ఉపాధ్యాయుడు లాభాల వేణు యువకుడి ప్రవర్తనను ప్రశ్నించగా, అతడు తన తండ్రి అయిన హెడ్‌కానిస్టేబుల్‌కు సమాచారం ఇచ్చాడు. కొద్దిసేపటి తర్వాత హెడ్‌కానిస్టేబుల్ తన కుమారుడితో కలిసి పాఠశాలకు చేరుకుని హెడ్మాస్టర్ గదిలోకి వెళ్లారు. అక్కడే హాజరు రిజిస్టర్‌పై సంతకాలు చేస్తున్న ఉపాధ్యాయుడు వేణుపై అందరి సమక్షంలో యువకుడు దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన తన తల్లి మాట కూడా వినకుండా దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు.
గాయపడిన ఉపాధ్యాయుడు వేణును వెంటనే రాజాం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మరోవైపు తనపై కూడా దాడి జరిగిందని ఆరోపిస్తూ హెడ్‌కానిస్టేబుల్ కుమారుడు కూడా ఆసుపత్రిలో చేరడం గమనార్హంగా మారింది.
డోలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ ఆర్.వి.జి.ఎన్. మురళీకృష్ణ మాట్లాడుతూ, తన సమక్షంలోనే ఉపాధ్యాయుడిపై దాడి జరిగిందని, ఈ ఘటనపై ఇతర ఉపాధ్యాయులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పాఠశాల ఆవరణలో ఇటువంటి ఘటనలు జరగడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని అన్నారు.
విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఘటనను ఖండిస్తూ, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజాం టౌన్ సీఐ అశోక్‌ను కోరినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు అవసరమని పేర్కొన్నారు.
ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మజ్జి మధన్మోహన్, యూటీఎఫ్ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఉపాధ్యాయుల భద్రతకు భంగం కలిగించే ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాజాం ఎంఈవో యాగాటి దుర్గారావు మాట్లాడుతూ, ఘటనపై పూర్తి వివరాలు సేకరించి జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యం నాయుడుకు ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో పాటు లిఖితపూర్వక నివేదిక కూడా పంపినట్లు తెలిపారు.
అయితే రాజాం టౌన్ సీఐ అశోక్‌కుమార్ స్పందిస్తూ, ఈ ఘటనపై తమకు ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు అందలేదని, ఇరువర్గాలు పరస్పర అంగీకారంతో రాజీ చేసుకున్నట్లు తెలిపారు. అయినప్పటికీ ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.








